బిహార్ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. నిజాయితీ పరుడిగా పేరున్న సీఎం నితీశ్ కుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ కూడా బహుధా కీర్తిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రకంగా ఎడ్వాంటేజీ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇటీవలి పరిణామాల్లో కొన్ని విషయాలు మాత్రం బీజేపీ మీద నిందలు పడడానికి కారణం అయ్యాయి.
రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన ఎల్‌జెపి ఎన్డీయేలో భాగస్వామి పార్టీనే. కానీ బీహార్ రాజకీయాల్లో వారు వేరుకుంపటి పెట్టుకున్నారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్రమంతా ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తర్వాత.. అధికారంలోకి బీజేపీ వచ్చేట్లయితే తమ మద్దతు వారికే ఉంటుందని కూడా ప్రకటించారు.
అయితే.. ఇలాంటి ఎల్జేపీ ప్రకటన పూర్తిగా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అనే ప్రచారం బాగా వచ్చింది. అలా ప్రచారం కావడానికి సహేతుకమైన కారణాలున్నాయి. ఎల్జేపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలోంచి బయటకు రాలేదు. కేవలం రాష్ట్రంలో మాత్రమే వేరుకుంపటి రాజకీయాలు నడుపుతాం అని ప్రకటించింది.
దీనిద్వారా.. వారుకొన్ని సీట్లు సాధిస్తే గనుక.. వారికి వచ్చిన సీట్ల సంఖ్య ఫలితాల అనంతరం.. అధికారంలో ఎవరుండాలనే విషయాన్ని నిగ్గుతేల్చే స్థాయిలో ఉంటే.. సీఎం పీఠం మీద బీజేపీ నాయకుడిని కూర్చోబెట్టడానికే ఇలాంటి కుట్ర జరగుతోందని వాదన వచ్చింది. ఎల్జేపీ మాటలు మాత్రం అందరిలోనూ అదే అభిప్రాయాన్ని కలిగించాయి. బీజేపీ-నితీశ్ కుమార్ మధ్య సగంసగం సీట్లు పంచుకునేలా ఒప్పందం కుదిరింది. అంటే మొత్తం 243 లో 122 స్థానాల్లో నితీశ్ సారథ్యంలోని జేడీయూ పోటీచేస్తుంది. జితన్ రాం మాంజీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీకి జేడీయూ వాటాలోంచే సీట్లు ఇచ్చుకోవాలి. అదే తరహాలో.. భాజపా వాటాకు వచ్చిన 121 సీట్లలో ఎల్జేపీకి వారే సీట్లను కేటాయించుకోవాలి.
పేచీ అక్కడే వచ్చింది. బీజేపీకి వచ్చే వాటాలోంచి ఎల్జేపీ 42 సీట్లు అడిగింది. అయితే కేవలం 15 మాత్రమే ఇస్తామని ఒకసారి, 27వరకు ఇస్తామని ఒకసారి బీజేపీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తమకు 143 మంది అభ్యర్థులు ఆల్రెడీ రెడీగా ఉన్నారని ప్రకటించుకున్న ఎల్జేపీ… అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా సొంతంగానే పోటీచేస్తామని ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన చిరాగ్ పాశ్వాన్, ఫలితాల తర్వాత.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే సహకరిస్తామని అన్నారు.
అందుకే బీజేపీపై కుట్ర నింద
చిరాగ్ ప్రకటన చూసిన అందరూ.. నితీశ్‌తో కలిసి పోటీచేస్తూనే.. సీఎం పీఠం దక్కించుకోవడానికి కమలం పార్టీ ఎల్జేపీని పావుగా వాడుకుంటున్నదని భావించారు. ఈ నేపథ్యంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి పీఠం మీద నితీశ్ కుమార్ మాత్రమే ఉంటారని పేర్కొంది.
అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కే.. బీజేపీ దళాలు గట్టిగానే జై కొడుతున్నప్పటికీ.. ఎన్నికల తర్వాత.బలాబలాలు మారితే.. సమీకరణాలు మారవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది.











