నటనలో సమంత ఎంత ఈజ్ కనబరుస్తుందో యాంకరింగ్ లోనూ అంతే ఈజ్ కనబరుస్తోంది. ‘ఆహా’లో వస్తున్న సమంత టాక్ షో ఓహో అనిపిస్తోంది. అంత రిచ్ గా ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీల ఇంటర్వ్యూలంటే ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు మొదలెట్టేస్తారు. ఈ టాక్ షో అలా కాకుండా మొదట్నుంచి చివరి వరకూ కొత్త దనం కోసం తాపత్రయ పడినట్టు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెగాస్టార్ షో మీద కూడా మంచి హైప్ వచ్చేసింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఇలాంటి కార్యక్రమం చేసినందుకు సమంతకు లభించే పారితోషికం ఎంత? ఇప్పుడిదే హాట్ టాపిక్. సినిమాలు చేస్తే కోట్లు వచ్చేస్తాయి.. మరి టాక్ షోకు ఎంతిస్తారు? మహా అయితే ఒక్క షోకు లక్ష ఉంటుందా?.. దీనికి సమాధానం చెప్పాలంటే కష్టమే. ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ అంత తక్కువేమీ కాదు. దీనికి కోటిన్నర రూపాయలు ఆమె తీసుకుందట. ఈ మొత్తానికి ఆమె 10 ఎపిసోడ్ లు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కు రూ. 15 లక్షలన్న మాట. ఇది తక్కువెలా అవుతుంది.. చాలా ఎక్కువే. ఇలాంటి షోలకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడం తెలుగులో ఇదే మొదటిసారి కూడా.
దీన్ని బిగ్ బాస్ షో తో మాత్రం పోల్చకూడదు. అల్లు అరవింద్ కోసమే ఇంత తక్కువ మొత్తానికి ఆమె ఒప్పుకుందని మరి కొందరు అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే ఒక్కో షోకి ఆమె 25 లక్షలు తీసుకోవాలేమో. అసలు ఈ షో అంతగా ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయం ఇంకొందరిలో ఉంది. కావాలనే ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం ఇలాంటి కార్యక్రమాలను హోస్ట్ చేసే లక్షణాలు సమంతలో మెండుగా ఉన్నాయి. తెలుగులో ఉన్న ఓటీటీ ఇదొక్కటే కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం సమంత బెస్ట్ ఛాయిస్ అవుతుంది.











