(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రూ. 300 లక్షల నాబార్డ్ నిధులతో విజయనగరం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 50 పడకల స్థాయి పెంపునకు, ఆధునీకరణకు, భద్రగిరిలో రూ.895 లక్షల నాబార్డ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
Also Read:-నవశకానికి నాంది: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
పాడేరులో రూ. 500కోట్లతో మెడికల్ కాలేజీ
గిరిజన ప్రాంతమైన పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేశారంటే, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పుష్పశ్రీవాణి అన్నారు. గిరిజనుల కోసం పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యం అందే అవకాశం ఉందని తెలిపారు. భద్రగిరిలో ఒక్క డాక్టర్ తోనే సి.హెచ్.సి కొనసాగుతుందని, డాక్టర్లు అవసరమున్నా, మంజూరు లేక వైద్యులను నియమించుకోలేని పరిస్థితి మొన్నటివరకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చొరవ వల్ల రూ.8.95 కోట్ల రూపాయలతో భవిషత్తులో అన్ని వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రిగా మారనుందని సంతోషం వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి నాడు – నేడు లో భాగంగా నివేదికలు పంపామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి కురుపాం ఆసుపత్రి అభివృధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read:-నవశకానికి నాంది: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
ప్రతి మండలానికి 108 వాహనం
మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, ప్రతి మండలానికి ఒక 108 వాహనాన్ని పూర్తి వైద్య సౌకర్యాలతో అందించారని శ్రీవాణి చెప్పారు. కొమరాడలో నాగావళి నదిని దాటించి, వారికి మెరుగైన వైద్యం అందించి సురక్షితంగా ఇంటికి చేర్చారని, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 108 సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, డి.సి.హెచ్. జి.నాగభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.











