ఇటీవల డ్రగ్స్ కేసు శాండల్ వుడ్ ను షేక్ చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేకమంది ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో వివేక్ బంధువు అదిత్య అల్వాకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
అదిత్య అల్వా సోదరి ప్రియాంకను వివేక్ వివాహం చేసుకున్నాడు. ఈ సోదాలు నిర్వహించడంపై పోలీసులు మాట్లాడుతూ ప్రస్తుతం అదిత్య అల్వా పరారీలో ఉన్నాడని, వివేక్ ఆదిత్యకు బంధువు కావడంతో అతని గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని సోదాలు చేపట్టామని తెలిపారు. సోదాలకు సంబంధించి కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నామని, ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ బృందం ముంబైలోని నటుడు వివేక్ ఓబ్రాయ్ నివాసాని వెళ్లిందని తెలిపారు.
మరోవైపు పోలీసులు బెంగళూరులోని అదిత్య అల్వా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అదిత్య అల్వాకు సంబంధించిన పలు కీలక పత్రాలు దొరికినట్లు సమాచారం. ఈ కేసులో అదిత్య అల్వాతో పాటుగా శివప్రకాశ్ చుప్పి, షేక్ ఫాజిల్ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి సంజనాను, మరో నటి రాగిణి ద్వివేదిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీళ్లకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరిస్తూ రిమాండ్ గడువు పొడిగించింది కూడా. నటి సంజన అనేకమంది సినీ ప్రముఖుల పేర్లను బయట పెట్టింది. వారందరిని పోలీసులు విచారిస్తున్నారు. మున్ముందు ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎందరి పేర్లు బైటికి వస్తాయో చూడాలి మరి.











