ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది. జగన్ చేసిన చర్యను తప్పుపడుతూ అనేక మంది గళం విప్పుతున్నారు. న్యాయనిపుణులు, మాజీ న్యాయమూర్తులు సీజేకు లేఖలు రాస్తున్నారు. అయితే ఇంత గందరగోళం సాగుతుండగా.. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక.. వివాదాస్పదమైన ఒక మాజీ న్యాయవాది ఉన్నారనే వార్త ఆసక్తికరం. వైఎస్సార్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఆయన ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకు లేఖ వ్యవహారంలో జగన్ చర్యలను తప్పుపట్టారు. ఢిల్లీ బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు న్యాయవాదుల అసోసియేషన్‌లు ఏపి సీఎం చర్యలను తప్పుపట్టాయని ఆయన అన్నారు. ఏపీ సీఎం అధికార దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ల పై త్వరలో విచారణ ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రభుత్వానికి అక్షింతలు, మందలింపులు తప్పవని రఘురామక్రిష్ణ రాజు జోస్యం చెప్పారు.
ఆసక్తికర విషయం బయటపెట్టిన ఆర్ఆర్ఆర్
జగన్ రాసిన లేఖకు సంబంధం ఉంటుందని అనుమానం కలిగేలా మరో ఆసక్తికరమైన అంశాన్ని రాజు బయటపెట్టారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారని అంటూ మనోహర్ రెడ్డి అనే వ్యక్తిగురించి వివరాలు చెప్పారు. 2012లో ఎం మనోహర్ రెడ్డి అనే న్యాయవాది ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ఆరోపణల పర్వానికి తెరతీసారని ఆయన అన్నారు. 2011 డిసెంబరు 27 లో సాక్షి దినపత్రికలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన కథనం పై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసు కొట్టివేసి, పిటీషనర్లకు 50 వేల జరిమానా విధించారన్నారు. బార్ అసోసియేషన్ నుండి మనోహర్ రెడ్డిని బహిష్కరించాలని కోర్టు అభిప్రాయపడిందని చెప్పారు. అప్పుడు పిటీషన్ వేసిన మనోహర్ రెడ్డి కి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చారని చెప్పారు.
సీఎం అంతఃపురం వదిలి బయటకు వచ్చి వాస్తవాలు చూడాలని ఎద్దేవా చేసిన రఘురామక్రిష్ణ రాజు.. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి సరైన స్పందన లేకపోవడంతో మరోసారి సీఎం ఢిల్లీ పర్యటన చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం కు పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందని, అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాసారనే సంగతిని కూడా ఎంపీ ప్రస్తావించారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం కొంత మంది న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారన్నారు.
బెయిల్ మీద ఉన్న వ్యక్తులు వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, న్యాయమూర్తులను దూషించిన కేసులో విజయసాయిరెడ్డి పై ఒక వేళ ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై సకాలంలో విచారణ పూర్తి చేసుకుని అగ్నిపునీత సీతలా బయటకు రావాలని రాజు డిమాండ్ చేశారు. సలహాదారులు సరియైన వారు అయితే సీఎం తప్పులు చేసే అవకాశం ఉండదంటూ తన పాత ఆరోపణనే రఘురామక్రిష్ణ రాజు మరోసారి వినిపించారు.
ముఖ్యమంత్రిపై రఘురామక్రిష్ణ రాజు అనేక ఆరోపణలు చేసినప్పటికీ.. గతంలో సుప్రీం న్యాయమూర్తిపై ఆరోపణలుచేసి, తర్వాతి కాలంలో జగన్ సర్కారులో పదవులు పొందారని అంటున్న మనోహర్ రెడ్డి గురించిన వివరాలు బయటపెట్టడంతో.. జగన్ లేఖ వెనుక ఆయన హస్తం కూడా ఉండవచ్చునని పలువురు అనుకుంటున్నారు.











