అన్ స్టాపబుల్ 2 చప్ప చప్పగా ఉందనుకునేవారికి మంచి మసాలా పడినట్టే. ఎప్పుడైతే ప్రభాస్ – గోపీచంద్ గెస్ట్ లుగా రాబోతున్నారని తెలిసిందో ఈ షోకి హైప్ వచ్చేసింది. ఈ షోకి గెస్ట్ గా వచ్చి ప్రభాస్ పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నదానిపై చర్చ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 11న చేసి 31వ తేదీ ప్రసారం చేయనున్నారు. ఒకవిధంగా కొత్త సంవత్సరంలో సందడి ఇది. కాంట్రావర్సీ ప్రశ్నలు లేకుండా ఈ షోకి మజా ఉండదనే విషయం నిర్వాహకులకు కూడా అర్థమయ్యే ఉంటుంది. తాజా ఎపిసోడ్ లో నిర్మాతలు డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హాజరైన సంగతి తెలిసిందే.
ఈ ఎపిసోడ్ లో కూడా మంచి మజా ఉన్నట్టే. కాకపోతే చిరు, బాలయ్యలతో పాటు వీరితో శ్రుతి హాసన్ కూడా తోడైతే ఈ షో సూపర్ సక్సెసే. ఎలాగూ మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి అల్లు అరవింద్ ఓ ఫీలర్ కూడా వదిలారు కాబట్టి ఆ సినిమాకి ముందే మల్టీ స్టారర్ షోకు తెరలేచినట్టుగానే అందరూ భావిస్తున్నారు. ఈ మజా ఈ సీజనులో ఉండేలానే ఉంది. ఇలాంటి గెస్ట్ లు ఉంటే బుల్లి తెర బ్లాస్ట్ అయినట్టే. ప్రభాస్, గోపీచంద్ లు ఈ ఎపిసోడ్ కు హాజరుకావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీరిద్దరు కలిసి హీరో విలన్లుగా వర్షం చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. పైగా వీరిద్దరూ మంచి స్నేహితులు.
వర్షం చిత్రం నుంచి ఈ స్నేహం కొనసాగుతోంది. గోపీచంద్ కూడా హీరోగా నిలబడ్డారు. ఈసారి బుల్లి తెరను కూడా షేక్ చేయబోతున్నారన్నమాట. మొత్తానికి డబుల్ థమాకా సందడితో ఈ టాక్ షో దూసుకుపోతోంది. ఊహలకు అందని విధంగా గెస్ట్ లు వస్తున్నారు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో వచ్చిన హైప్ సెకండ్ సీజనులో రాలేదన్నది వాస్తవం. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకే నిర్వాహకులు ఈ మెగా కాంబినేషన్ కు సిద్ధమయ్యారు. పైగా సంక్రాంతికి బాలయ్య, చిరుల సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ చిత్రాల్లో ఇద్దరు అగ్రహీరోల పక్కనా శ్రుతీ హాసనే నటించడం విశేషం. అలాగే ఈ టాక్ షో మరింత రక్తి కట్టాలంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ కూడా ఈ షోకి గెస్ట్ లుగా హాజరైతే ఇక తిరుగే లేదు. త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరవచ్చు.