నందమూరి బాలకృష్ణ రేపు ఉదయం ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు? రేపు ఉదయం 8.45 గంటలకు స్మాల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు బాలయ్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎల్లుండి మే 28న తన తండ్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని బాలయ్య ఈ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు మాత్రం అందరికీ అర్తమవుతోంది. కాకపోతే అదేంటి అనేదే ప్రశ్న. అసలు కరోనా సెకండ్ వేవ్ రాకుంటే బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రాన్ని ఈ తేదీకే విడుదల చేయాలని బాలయ్య భావించారు.
ప్రస్తుతానికి ఆ సినిమా వాయిదా పడినట్టే. బలయ్య చిన్న సర్ ప్రైజ్ అంటుంటే, ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ మాత్రం ఇది పెద్ద సర్ ప్రైజే అంటున్నారు. ఎన్.బి.కె. ఫిలిమ్స్ పతాకంపై ఏదో కొత్త విషయాన్నే ప్రకటించేలా ఉన్నారు. దీనిపై నందమూరి అభిమానుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మీద స్పష్టత రావచ్చని కొందరు ఊహిస్తున్నారు. ఎన్.బి.కె. ఫిలిమ్స్ ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ తీసింది. ఇప్పుడు కూడా సినిమా అనౌన్స్ మెంట్ ఉండొచ్చని అంటున్నారు.
కానీ మనకు తెలిసిని సమాచారం వేరేలా ఉంది. తన వారసుడు బాలయ్యేనని ఎన్టీఆర్ ఎప్పుడో ప్రకటించారు. అలాగే బాలకృష్ణకు కూడా తన తండ్రి గారంటే వల్లమాలిన అభిమానం. తన తండ్రికి ఏది చేస్తే నచ్చుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆ మధ్య భీష్మ ఏకాదశికి గతంలో తాను తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ ను విడుదల చేశారు బాలకృష్ణ. అలాగే ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’లోని శివశంకరీ గీతాన్ని తన పుట్టిన రోజు సందర్భంగానూ ఆలపించారు. ఇప్పుడ రాబోయేది తన తండ్రి 99వ జయంతి.
ఈ సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గాత్రంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీన్ని మే 28న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని రేపు ఉదయం అధికారికంగా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఎన్టీఆర్ నటించిన శ్రీరాముడి పాత్రలను జోడిస్తే ఎంత కనువిందుగా ఉంటుంది. ఎన్టీఆర్ పాత్రలను బాలయ్య ‘శ్రీరామదండకం’ ఎంతటి వినసొంపుగా ఉంటుందో చూడాల్సిందే.











