కరోనా సంక్షోభంలో ప్రజల్ని ఆదుకునే విషయంలో కన్నడ నటులు బాగా స్పందిస్తున్నారు. నటుడు చరణ్ రాజ్ కూడా ఇలా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనా వారియర్స్ అయిన పోలీసులకు నటుడు చరణ్ రాజ్ తన సహకారాన్ని అందించారు. చెన్నైలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు వద్దకు వెళ్లి వారికి ఫుడ్, మంచి నీరు అందించే ఏర్పాట్లను ఆయన చేశారు.
ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సినీ నటులు, వివిధ సంఘాలు ప్రజలకు ఏదో ఒక రూపంలో సహకారాన్ని అందిస్తున్నారు. కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో చరణ్ రాజ్ నటించారు. అంతేకాదు దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, చిత్రనిర్మాతగా, రచయితగానూ చరణ్ రాజ్ కు గుర్తింపు ఉంది. బెంగళూరులో నటుడు ఉపేంద్ర, సుధీప్ కూడా ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
ఉపేంద్ర రైతుల నుంచి కూరగాయలను కొనుగోలు చేసి తెచ్చి అవసరమైనవారికి అందిస్తున్నారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తనదైన రీతిలో స్పందిస్తున్నారు. నటి రాగిణి ద్వివేది, సంజన, హర్షికాలతో కలిసి ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. నటుడు సుధీప్ ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా నిలిచారు. అందులో భాగంగానే చరణ్ రాజ్ పోలీసులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఎంతో కష్టపడుతున్న పోలీసులకు అండగా నిలవాలని ఆయన భావించారు.











