తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మీది గుండెనా..బండనా అంటూ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఆన్ లైన్ మీటింగ్‌లో వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే సెలెక్ట్ అయి కేవలం సర్టిపికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రమే పెండింగ్‌లో ఉందని,అయినా నెలల తరబడి జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.ఇప్పటికే స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన 658 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని,ఆ కుటుంబాల ఉసురు పోసుకోవద్దని హెచ్చరించారు.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
కాగా 2017లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అనుసరించి 2018లో పరీక్షలు నిర్వహించారు.2021 ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటించారు.కటాఫ్ మార్కుల పరిశీలన తరువాత 3.170 మంది అర్హత సాధించారని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. అందులో 3076 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాగా వాళ్లకి వెబ్ ఆప్షన్లను ఇచ్చారు.అయితే వీరిలో 2,418 మందిని మాత్రమే ఎంపిక చేసిన TSPSC మిగతా 658 మందికి సంబంధించి ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి చెందిన నేత ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో వారితో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ కరోనాను తెలంగాణలో ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తామని ప్రకటించినా,ఆ పథకంలో తెల్ల రేషన్ కార్డులున్నా చాలామందికి ఆ పథకం వర్తించదని, మిగతా వారిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఆరోగ్యశ్రీ అర్హులు 80 లక్షల మంది ఉండగా ఆయుష్మాన్ పథకం పరిధిలో కేవలం 26 లక్షల మందికే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని కొవిడ్‌కు కూడా వర్తింప జేయాలని కోరారు.కొవిడ్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతుంటే కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని,ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారన్నారు.కాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 23 వేల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,కరోనా ఓవైపు విజృంభిస్తున్నా ప్రభుత్వం పోస్టుల భర్తీకి ముందుకు రాకపోవడంపై ప్రశ్నించారు.బడ్జెట్‌లోనూ వైద్య ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపు తగ్గిందని వ్యాఖ్యానించారు.కొత్త ఆసుపత్రుల నిర్మాణం,50 వేల వైద్య సిబ్బంది నియామక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉండడం సంతోషకరమేనని,అయితే అంతకంటే ముందు 658మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాగా గతంలో కొవిడ్ వచ్చిన సమయంలో కేసీఆర్ హైదరాబాద్‌లోని యశోధ ఆసుపత్రికి వెళ్లారని,తరువాత పబ్లిసిటీ కోసం ముందుగా ప్రచారం చేసుకున్న కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్లారని విమర్శించారు.
కాగా లోటస్ పాండ్‌లోని షర్మిల పార్టీకి సంబంధించిన కార్యాలయానికి తాళం వేసి ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.అయితే కొవిడ్ కేసులు ఎక్కువవుతున్నకారణంగా షర్మిల ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారానే మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.










