2019 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత అధినేత చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రతినిధుల కమిటీలతో సమీక్ష నిర్వహించిన ఆయన తాజాగా ప్రజా ప్రతినిధుల సమీక్ష పూర్తి చేశారు. ఈ సమీక్షలో చంద్రబాబు శ్రేణులకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అధికార పక్షం అక్రమాలను గట్టిగా ప్రశ్నించడమే గాక మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిని అధ్యక్షుడిగా నియమించనున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి. అధినేత అధ్యక్షుడిగా అచ్చెన్నను ఎంపిక చేస్తారా? లేక ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకట్రావునే కొనసాగిస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
చంద్రబాబు నిర్ణయం
ఏపీ టీడీపీ కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు పూర్తయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నెల 27న అచ్చెన్న నియామకానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లడంలో అచ్చెన్న సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న టీడీపీ తరుపున గట్టిగా వాయిస్ వినిపించిన అచ్చెన్నను కొద్దీ రోజుల కిందట ఏసీబీ అధికారులు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్ మీద ఆయన బయటికి వచ్చారు. అక్రమ కేసులు బనాయించినా వెరవక ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావించినట్లు వార్తలు వినబడుతున్నాయి.
అధ్యక్ష పదవులు బీసిలకే
ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ కాలం ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు పార్టీ మరో కీలక పదవిని అప్పగించనుందని తెలుస్తోంది. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు స్థానంలో మరో బీసీ నేతనే ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించడం అచ్చెన్నకు కలిసి వచ్చిందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు 27న అచ్చెన్న పేరును చంద్రబాబు ప్రకటించనున్నారు. అక్టోబర్ 25 విజయదశమి రోజున అచ్చెన్న బాధ్యతలు తీసుకోనున్నారని సమాచారం.
ఇదే సమయంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ ను టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలతో పార్టీ ఆవిర్భావం నుంచి మద్దతు తెలుపుతున్న బీసీలకు టీడీపీ పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.











