హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్…వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిజెఎస్ పార్టీలు ఎన్నికల గ్రౌండ్ వర్క్ ను మొదలిపెట్టేశాయి. సన్నాహక కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా చేపడుతున్నాయి. కానీ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. దీంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారనున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాదిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నా, రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ నేత రామచంద్రరావు మండలి సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ హవా వీస్తున్న సమయంలోనూ శాసనమండలి పునరుద్ధరణ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీలకే గ్రాడ్యుయేట్లు పట్టం కట్టారు. ఈ సారీ కూడా ఈ స్థానాలను ప్రతిపక్షాలే తమ ఖాతాలో వేసుకోవాలని ఎవరికి వారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నారు. బిజెపి మరోసారీ హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్వీళ్లూరుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా. టిఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో చేజారిన ఈ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎలాగైనా హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేయాలని ఇతర పార్టీలకు భిన్నంగా ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. అభ్యర్థుల పేర్లను కెటిఆరే స్వయంగా పరిశీలిస్తున్నారు.
ఈసారి దాదాపు 6 లక్షల మంది వరకు ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ప్రధాన పార్టీలు ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థనంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో పోటీ ఎక్కువే….
హైదరాబాద్ స్థానం నుంచి గెలుపొందాలనే కసి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనబడుతోంది. పార్టీ మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంది. మిగతా పార్టీలతో పోలిస్తే హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలనుకునేవారి కాంగ్రెస్ అశావాహుల లిస్టు కూడా ఎక్కువగానే ఉంది. డజన్ల కొద్ది పేర్లు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. అంతిమ నిర్లయం అధిష్టానందే అయినప్పటికినీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, టిపిఆర్టియు వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కిచ్చనగారి లక్ష్మారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి పేర్లు సైతం వినబడుతున్నాయి. ఇలా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉవ్వీళ్లూరుతున్నారు. అదిష్టానం పంపే లిస్టులో తమ పేరే ఉంటుందని ఎవరికి వారూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపొందడంతో హైదరాబాద్ లో కూడా కాస్త కష్టపడితే ఎమ్మెల్సీ గా చట్టసభలకు వెళ్లొచ్చనే అభిప్రాయంతో వీరంతా ఉన్నారని తెలిసింది.
హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే వారు దాదాపు 20 మంది వరకు కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. ఎవరికి వారు పోటీ చేయాలనుకుంటున్నప్పటికినీ ఫైనల్ గా ఒకరి పేరు మాత్రమే కన్ఫామ్ కానుంది. వీరితోపాటు మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది.











