కరోనా గోల ఇంకా తగ్గలేదు. థియేటర్స్ ఓపెన్ అవడం లేదు. ఈ పరిస్థితుల్లో కొందరు హీరోలు.. ఓటీటీలే దిక్కని భావిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న తమ సినిమాల్ని డిజిటల్ రిలీజెస్ కు రెడీ చేస్తున్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం.. ఓటీటీలకు ససేమిరా అంటున్నారు. థియేటర్స్ లో విడుదల చేస్తే కలెక్షన్స్ బాగా రావడంతో పాటు.. తమ ఇమేజ్ కూడా పెరిగే అవకాశాలుండడంతో.. థియేటర్స్ తెరిచేవరకూ వెయిట్ చేసే తీరతామని అంటున్నారు. అలాంటి హీరోల జాబితాలో .. నాగచైతన్య కూడా చేరిపోయాడు. చైతూకి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. అతడి మార్కెట్ కూడా ఈ మధ్య బాగానే పెరిగింది. అలాంటప్పుడు తన సినిమాల్ని ఓటీటీలో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? అన్నది అతడి ఆలోచన.
శేఖర్ కమ్మల దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలోనే ఈ చర్చ అంతా జరుగుతోంది. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’ .. ఉభయ రాష్ట్రాల వారినీ ఫిదా చేసేసింది. దాంతో ఆయన క్రేజ్ రెట్టింపయింది. అలాగే చైతూ లాస్ట్ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టాయి.
ఈ నేపథ్యంలో తమిద్దరి క్రేజ్ తో రాబోతున్న సినిమాకి థియేటర్ రిలీజే ఉత్తమ మార్గమన్నది చైతూ అభిప్రాయం. శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం నాగచైతన్యకే ఒదిలిపట్టాడట.
‘ఆర్.ఎక్స్ 100’ హీరో కార్తికేయ కూడా తన తాజా సినిమా ‘చావు కబురు చల్లగా’ విషయంలో ఇలాగే రియాక్ట్ అయ్యాడు. తన సినిమాని థియేటర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నాడట. అలాగే.. మరికొందరు హీరోలు కూడా థియేటర్స్ తెరిచే వరకూ వెయిట్ చేయడానికే నిర్ణయించుకున్నారట. అయితే మరో పక్క సూర్య లాంటి స్టార్ హీరోలు .. తమ సినిమాల్నీ ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా మంచి హిట్టైతే… మిగతా స్టార్ హీరోలు కూడా ఆ దిశగా కదులుతారని అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చైతూ , కార్తికేయల ఆలోచనలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.











