ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాలం చెల్లింది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ చేసిన రచ్చ, అరాచకం అంతా ఇంతా కాదు. ఆనాడు కుప్పంపై పగబట్టి, అక్కడ టీడీపీ శ్రేణులను నానా ఇబ్బందులకు గురిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, అప్పట్లో ఆ అరాచకాలను వెనకనుండి నడిపించిన జగన్‌కు ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రస్తుతం వారిద్దరికి సొంత ఇలాకాలోనే టీడీపీ సినిమా చూపించింది!
అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చక్రం తిప్పింది. ముఖ్యంగా పుంగనూరులో వారి అరాచకాలు, బెదిరింపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కుప్పంపై కక్షగట్టి అక్కడ వైసీపీ నేతలతో నానా హంగామా చేయించిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఆయన సొంత గడ్డపైనే గట్టి ప్రతీకారం ఎదురైంది. పుంగనూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవితో పాటు మొత్తం 32 వార్డులు ఏకగ్రీవంగా టీడీపీ వశమయ్యాయి. పుంగనూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన నయామ్తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరి, కుప్పం మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థలోనూ టీడీపీ జైత్రయాత్ర కొనసాగుతుండటంతో పెద్దిరెడ్డి రాజకీయ సామ్రాజ్యం పునాదులతో సహా కదిలిపోయింది.
వైనాట్ 175.. వైనాట్ కుప్పం..అంటూ 2024 ఎన్నికలకు ముందు గప్పాలు కొట్టిన జగన్‌కు కుప్పంలో ప్రజలు షాక్ ఇస్తే..ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే రివర్స్ గేర్ పడింది. 1978 నుంచి పులివెందులపై వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. వారి ఫ్యాక్షన్ రాజకీయాలకు, బెదిరింపులకు భయపడి దశాబ్దాలుగా ఎవరూ ఎదురు తిరిగే సాహసం చేయలేదు. కానీ, ఇన్నాళ్లూ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న భయం, అసంతృప్తి ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలయ్యింది.
పులివెందులలో వైసీపీ నేతలు కనీసం అన్ని స్థానాలకు నామినేషన్లు వేయలేక చేతులెత్తేశారు. పులివెందుల పురపాలక సంఘం ఎన్నికల్లో 40 వార్డులకు గాను కూటమి 20 వార్డుల్ని ఏకగ్రీవంగా గెలుచుకోగా..నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీలకు ఏకంగా 64 స్థానాలు టీడీపీ కూటమికి ఏకగ్రీవమయ్యాయి. దీంతో నియోజకవర్గంలోని ఏడు ఎంపీపీ పదవులతో పాటు, జడ్పీటీసీ స్థానాలు కూడా కూటమి పరం అవుతున్నాయి.
ఇటీవల పులివెందులలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..పులివెందులలో గూబ గుయ్మనిపిస్తే ఆ సౌండ్ రాష్ట్రంలో మోగాలంటూ జగన్ తన కేడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే వెలువడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాల ఫలితాలు చూశాక..నిజంగానే చెంప ఎవరికి గుయ్మందో, పరాభవం ఎవరికి ఎదురైందో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోంది.ఆనాడు కుప్పంలో చేసిన అరాచకాలకు, అహంకార రాజకీయాలకు నేడు పుంగనూరులో పెద్దిరెడ్డి, పులివెందులలో జగన్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు











