(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘ఇందు గలడు.. అందులేడు.. ఎందెందు వెదికి చూచినా అందందే గలడు..’ అనే చందంగా జగనోరి జమానాలో ఎన్నో .. ఎన్నెన్నో వింతలు.. విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. అవి ఏ స్థాయికి చేరుకున్నాయంటే పదోతరగతి చదువుతున్న విద్యార్థినికి ఇళ్ల పట్టా ఇచ్చేశారు. దీనికంతటికీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, స్థానిక అధికారుల పట్టించుకోనితనం వెరసి వైసీపీ నాయకులు ‘చెప్పిందే వేదం .. ఆదేశించిందే చట్టం’గా మారిపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్న వాలంటీర్లు వారు చెప్పింది చేస్తూ.. పనిలో పనిగా ‘స్వకారం.. స్వామి కార్యం’ పూర్తి చేసుకుంటున్నారు. అర్హత ఉన్నా లేకపోయినా తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పనంగా అప్పగించేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇటువంటి సంఘటన ఒకటి ‘నవ్విపోదురుగాక .. నాకేటి సిగ్గు’ అనే విధంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అనర్హులకు అందలం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలతో పాటు తమాషాలు కూడా కనిపిస్తున్నాయి. ఇళ్ల పట్టా పథకంలో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఏకంగా విద్యార్థులు, అనర్హులైన గ్రామవాలంటీర్ల పేర్లు అర్హుల జాబితాలో దర్శనమిస్తున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామ సచివాలయం వడ్డివాడ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పేరు ఇంటి పట్టా మంజూరు జాబితాలో ఉండటంతో ఆ గ్రామస్తులు అవాక్కైనట్లు తెలిసింది. సంతబొమ్మాళి, నౌపడ, గోవిందపురం, మేఘవరం, కె.లింగూడు, ఉమిలాడ పంచాయతీల్లో అనర్హులైన వాలంటీర్లు వారి కుటుంబ సభ్యుల పేర్ల ఇళ్ల పట్టాలు జాబితాలో దర్శనం ఇస్తుండటంతో గ్రామస్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్నవారికి ఎలా ఇళ్ల పట్టాలు ఇచ్చారన్న దానిపై విచారణ చేపట్టాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అనర్హులను గుర్తించాం
ఈ అంశాలపై విచారణ జరిపి అర్హుల జాబితాలో అనర్హులను గుర్తించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంతబొమ్మాళి తహసీల్దారు ఎస్.రాంబాబు తెలిపారు.











