టాలీవుడ్ లో కథానాయికగా ఫెయిల్ అయి.. బాలీవుడ్ కెళ్ళిన ఏ దక్షిణాది భామా.. అక్కడ హీరోయిన్ గా సెటిల్ అయిన దాఖలాలు లేవు. అందం, అభినయం పరంగా.. అక్కడ రాణించడం.. అలాగే అక్కడ హీరోయిన్స్ కు గట్టిపోటీనివ్వడం సామాన్యమైన విషయం కాదు. అందుకే చాలా మంది సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ కి అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. కానీ అందాల తాప్సీని ఈ విషయంలో మినహాయించాలి. సౌత్ నుంచి ఆదరణ కరువైన అమ్మడు .. బాలీవుడ్ కు కరెక్ట్ టైమ్ లో వెళ్ళింది. ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోవడం ఆశ్చర్యమే.
‘ఝుమ్మదినాదం’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ . దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాయాజాలంతో అమ్మడు గ్లామరస్ హీరోయిన్ గా బాగానే ఎలివేట్ అయింది. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. కానీ ఆమె నిలదొక్కుకోలేకపోయింది. ఒక దశలో తాప్సీ సెకండ్ హీరోయిన్ వేషాలు కూడా వేయాల్సి వచ్చింది. టాలీవుడ్ లో అవకాశాలు అడుగంటుతున్న సమయంలో .. తాప్సీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేవలం హీరోయిన్ వేషాలే వేయాలనే రూల్సేమీ పెట్టుకోకుండా.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా తాప్సీకి బాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు, కమర్షియల్ మూవీస్ కు సైతం తాప్సీ మంచి ఆప్షన్ గా మారడంతో.. ఆమెతో పెద్ద పెద్ద సంస్థలన్నీ సినిమాలు తీస్తున్నాయి. ఈ క్రమంలో తాప్సీ ఖాతాలో మంచి హిట్స్ పడ్డాయి. బాలీవుడ్ ప్రముఖులతో తాప్సీ మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేయడమే కాకుండా.. అనేక సందర్భాల్లో వారికి ఆమె అండగా నిలబడడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది. స్వతహాగా తాప్సీ నార్త్ అమ్మాయి కాబట్టి.. ఆమెకు ఆ ఏంగిల్ లో కూడా ఆఫర్స్ బాగా వస్తున్నాయి.
ఈ ఏడాది కరోనా కారణంగా తాప్సీ నటించిన సినిమాలేమీ విడుదల కాకపోయినా.. వచ్చే ఏడాది .. ఓ అరడజను సినిమాల వరకూ విడుదల కానున్నాయి. అలాగే ఆమె చేతిలో మరో అరడజన్ సినిమాలకు పైగానే ఆఫర్స్ ఉన్నాయి. సో.. తాప్సీ కి మరో రెండేళ్ళ వరకూ బాలీవుడ్ లో ఎలాంటి ఢోకా లేదు. అలా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఫెయిల్ అయి.. బాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన అమ్మడికి.. ఫ్యూచర్ లో సౌత్ నుంచి అవకాశాలు వస్తాయో లేదో తెలియదు కానీ.. అదే కానీ జరిగితే.. తాప్సీ బాలీవుడ్ బ్యూటీస్ లాగానే.. భారీ పారితోషికం డిమాండ్ చేసి.. మన మేకర్స్ కు షాకిచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి టాలీవుడ్ గుర్తించని ఎందరో బ్యూటీస్ లిస్ట్ లో ఇప్పుడు తాప్సీ పేరు కూడా చేరిపోయింది.











