ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసే ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు తెరదించుతూ టైమ్ మ్యాగజైన్ 100 మందితో కూడిన అత్యంత ప్రభావశీలురైన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీతో బాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా, నటుడు ఆయుష్మాన్ ఖురానా, బిల్కిస్ బానోలు ఈ జాబితాలో ఉన్నారు.
మోడీపై తీవ్ర విమర్శలు
బీజేపీ శ్రేణుల బాధ వర్ణాతీతమని చెప్పక తప్పదు. తమ ప్రియమైన నాయకుడు మోడీ ప్రతిష్టాత్మకమైన టైమ్స్ లో చోటు చేసుకున్నాడని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మోడీని ఈ జాబితాలో చేర్చడానికి కారణాన్ని వివరిస్తూ మ్యాగజైన్ మోడీపై నిప్పులు చెరిగింది. ”డెమోక్రాటిక్ దేశంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవడం సర్వసాదారణం. ఆ ఎన్నికలలో గెలిచిన వారు తమకు ఓటు వేసినా వేయకపోయినా అందరి కోసం పనిచేయాలి. దురదృష్టవశాత్తు అలాంటిది ఇండియాలో జరగడం లేదు. ప్రధాని మోడీ కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి హక్కులను కాలరాస్తున్నారని” తమ మ్యాగజైన్ లో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో బీజేపీ శ్రేణులు టైమ్స్ మ్యాగజైన్ పై నిప్పులు చెరుగుతున్నారు.
2019 ఎన్నికల ముందు కూడా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో మోడీ చోటు దక్కించుకున్న విషయం విదితమే. అప్పుడు కూడా “ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్” అంటూ మోడీపై ఓ కథనాన్ని అందించింది. దీంతో బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విపక్షాలు మాత్రం టైమ్స్ మ్యాగజైన్ చెప్పినదాంట్లో తప్పేమిలేదని కామెంట్ చేస్తున్నారు.
మ్యాగజైన్ అందరిని ఆశ్చర్యపరిచిన ఎంపిక బిల్కిస్ బానో. దీంతో ఆమె ఎవరు? అంటూ గూగుల్ లో నెటిజన్స్ తెగవెదికారు. గూగుల్ ఇచ్చిన జవాబుతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. కానీ గత ఫిబ్రవరిలో ఢిల్లీ షాహీన్ బాగ్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు. అల్లర్లకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొనడం జ్యూరీని ఇంప్రెస్స్ చేసింది. ఈ వయస్సులో కూడా ఈమె ఆందోళనకారులకు తన మద్దతు తెలుపుతూ వారిలో స్ఫూర్తిని నింపిందని మ్యాగజైన్ పేర్కొంది. ఏ అండ లేకుండా సినిమాలలోకి అడుగుపెట్టి అనతికాలంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న ఆయుష్మాన్ ఖురానాకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
తనను ఈ జాబితాలో చేర్చినందుకు ఆయుష్మాన్ టైమ్స్ మ్యాగజైన్ కు ధన్యవాదాలు చెప్పాడు. ప్రముఖ నటి దీపికా పదుకొనె కూడా ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురిపించారు. నూటికి నూరు శాతం టైమ్స్ మ్యాగజైన్ లో ఉండేందుకు ఆయుష్మాన్ అర్హుడు అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రాణాంతకమైన వ్యాధి హెచ్ఐవీకి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్న రవీంద్ర గుప్తా, దిగ్గజ ఐటీ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారని మ్యాగజైన్ తమ కథనంలో వివరించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కమలా హరీష్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు.











