ఏ పాత్రపోషించినా … దానికి నేచురల్ టచ్ ఇచ్చి.. జీవం పోయడం మాస్ మహారాజా రవితేజ స్టైల్. ఎన్నో సినిమాలు అతడి పెర్ఫార్మెన్స్ వల్లనే బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. అతడి సినిమాల్ని ఎక్కువగా మాస్ ప్రేక్షకులే ఆదరిస్తుండడం వల్ల రవితేజ ఇప్పటికీ తన జెర్నీ కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడి ఖాతాలో సరైన హిట్ పడలేదు. అయినా సరే.. తన శైలిలో తాను.. వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకుంటున్నాడు. అంతేకాదు ప్రయోగాల జోలికి అసలు పోకుండా.. తన ప్రధానబలమైన మాస్ యాక్షన్ మూవీస్ పైనే కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు.
రవితేజ ఆఖరుగా సక్సెస్ అందుకున్న సినిమా..‘ రాజా దిగ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ అంధాభినయం అందరినీ మెప్పించింది. దాని తర్వాత రవితేజ నటించిన సినిమాలన్నీ స్ట్రైట్ మూవీసే కావడం.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికలపడడం జరగడంతో.. రవితేజ ఇకపై రీమేక్స్ మీదే తన ఫోకస్ పెడుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో సెట్స్ మీదున్న ‘క్రాక్’ .. తమిళ సేతుపతి ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో మాస్ మహారాజా పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు.
తమిళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో ఘంటా రవితేజ తో జయదేవ్ గా రీమేక్ అయింది . అయితే ఈ సినిమాను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. అయినా సరే.. రవితేజకి ఆ కథాంశం బాగా నచ్చడంతో .. సేతుపతి ని క్రాక్ గా దింపుతున్నాడు గోపీచంద్ మలినేని. ఇక రవితేజ నెక్స్ట్ మూవీ కూడా తమిళ రీమేకే అవడం విశేషం. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అరవింద స్వామి, త్రిష జంటగా నటించిన ‘చతురంగ వేట్టై 2’ సినిమాను .. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.
ఇందులో రవితేజ ఓ వెరైటీ రోల్ ప్లే చేయబోతున్నాడు. నిజానికి రెండేళ్ళ క్రితమే ‘చతురంగ వేట్టై 2’ సినిమా విడుదల కావాలి.కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో కుదరలేదు. అతి త్వరలో ఈ సినిమా తమిళంలో విడుదల కాబోతోంది. అలాగే.. రవితేజ త్వరలో మరో తమిళ రీమేక్ ను కూడా లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ఒకటి.. తమిళ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్ వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. త్వరలో ఆ సినిమా ను రవితేజ, పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలను కుంటున్నారట. మరి ఈ తమిళ రీమేక్స్ తో అయినా రవితేజ .. హిట్టు గట్టెక్కుతాడేమో చూడాలి.