తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌కు అత్యంత ఆప్తులుగా భావిస్తున్న విష్ణు రెడ్డి, ఆయన బావమరిది సుజయ్ రెడ్డి, వ్యాపార భాగస్వామి అనిల్ రెడ్డి అనే ముగ్గురు ప్రభుత్వంలో కీలక విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, వారే మైనింగ్ కాంట్రాక్టులతో పాటు కీలక శాఖలను శాసిస్తున్నారని ప్రతిపక్ష DMK నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఇందులో విష్ణు రెడ్డి కొన్నేళ్లుగా విజయ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరుల్లో ఒకరు కాగా, సినీ రంగం నుంచి విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి వ్యూహరచనలో, ఐటీ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. ఇక, సుజయ్ రెడ్డి విష్ణు రెడ్డికి సమీప బంధువు. అనిల్ రెడ్డి ఈ ఇద్దరితో కలిసి బిజినెస్ నెట్‌వర్క్ నడుపుతున్న బిజినెస్ పార్ట్‌నర్.
గతంలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్‌ల వెనుక చక్రం తిప్పిన కీలక సూత్రధారులు కూడా వీరేనన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది అప్పట్లో ఏపీలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, పాలనాపరమైన లొసుగులను తమ వ్యాపార, ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు వాడకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఈ ముగ్గురు రెడ్లు..ఇప్పుడు విజయ్ పంచన చేరి చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో విజయ్ సమక్షంలో ఈ విష్ణు రెడ్డి, రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోక్యసామితో కలిసి అధికారిక సమీక్షలు, క్యాబినెట్ భేటీల్లో పాల్గొన్నారంటూ DMK పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది.
ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలు లేకున్నా..ఈ రెడ్డి త్రయం తమిళనాడు సెక్రటేరియట్‌లో చక్రం తిప్పుతోందని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో వీరికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ ఆరోపిస్తున్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులను, మంత్రులను పక్కనబెట్టి, ప్రైవేటు వ్యక్తులైన వీరికి పవర్ కట్టబెట్టారని DMK ఆరోపిస్తోంది.











