స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ప్రమోట్ అయిన సునీల్.. కొన్ని సినిమాలతో మాత్రమే సక్సెస్ దక్కించుకోగలిగాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు అతడ్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. దాంతో మళ్ళీ కామెడీ పాత్రలు, ప్రధాన పాత్రలు.. ఆఖరికి విలన్ గాకూడా టర్న్ అయిపోయాడు. ఇప్పుడు మరోసారి సునీల్ కి హీరోగా చేయాలనే బుద్ది పుట్టిందట. దానికోసం ఓ కన్నడ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. సినిమా పేరు ‘బెల్ బాటమ్’. రిషబ్ షెట్టి, హరిప్రియ జంటగా నటించిన ఈ సినిమా కన్నడనాట సెన్సేషనల్ హిట్ అయింది.
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ‘బెల్ బాటమ్’ రీమేక్ రైట్స్ దక్కించుకోగా.. ఈ సినిమా మీద సునీల్ బాగా ఆసక్తి చూపిస్తున్నాడట. దర్శకుడు ఇంకా తెలియదు కానీ.. ఓ ప్రముఖ నిర్మాత మాత్రం బెల్ బాటమ్ రీమేక్ రైట్స్ దక్కించు కున్నట్టు సమాచారం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అవ్వాలని కలలుగనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఓ రాబరీ కేస్ పరిష్కరించి తన కలను నెరవేర్చుకుంటాడట. ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా సునీల్ తనకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడట. మరి సునీల్ తొడిగే కన్నడ ‘బెల్ బాటమ్’ .. తెలుగులో ఏ రేంజ్ లో నవ్వులు పూయిస్తుందో చూడాలి.











