మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరంజీవి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. అయితే గత 5 రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టు చేయించుకోవలసిందిగా కోరారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తానని చిరంజీవి ట్విట్టర్‌లో తెలిపారు.
సీఎంను కలిసిన చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే పెద్ద హాట్‌టాపిక్. చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రగతి భవన్ వర్గాల్లో కలవరం మొదలైకనట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన సినీనటుడు నాగార్జునతో కలిసి చిరంజీవి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వరద సాయం చెక్కులను వారు కలిసి సీఎంకు అందజేశారు. అలాగే సినిమా పరిశ్రమ విస్తరణ-సినిమాహాళ్లు తెరిచే అంశంపై చర్చ జరిపారు. ఈ సమావేశంలో రోడ్లుభవనాల శాఖ మంత్రి వేమల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్, మరికొంత మంది అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సమావేశమే అందరిలో కలవరం లేపుతోంది. రెండు రోజుల క్రితం చిరంజీవి సీఎంను కలవడం అందులో ఉన్నతాధికారులు ఉండడం కలవరపాటును గురిచేస్తోంది. అలాగే నిన్న ఆదివారం టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్.. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో సెల్ఫీదిగారు. ఇద్దరు కలిసి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు కూడా నాటారు. అలాగే ఈ రోజు కూడా జగపతిబాబును సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కలిసినట్లు సమాచారం. ఇలా చిరంజీవిని కలిసినవారు, సీఎంను కలిసిన వారు ఇంకా ఎవరెవరు, ఎంతమందిని కలిశారనే కలవర పాటు సర్వత్ర వ్యక్త మవుతోంది. అయితే చిరంజీవిని కలిసిన వారు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నట్లు సమాచారం. హోంక్వారంటైన్‌లో కూడా వెళ్తున్నట్లు సమాచారం.
మాస్కుల్లేకుండా…
రెండు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జునలతో సీఎం కేసీఆర్ తెలంగాణ సినిమా పరిశ్రమ విస్తరణపై ప్రగతి భవన్‌లో సమావేశంలో పాల్గొన్నారు. అయితే దానికి సంబంధించిన ఒక ఫోటో బాగా వైరలైంది. ఆ ఫోటోలో సీఎం, చిరంజీవి, నాగార్జున మరికొంత మంది మాస్కులు లేకుండానే ఉన్నారు. మాస్కులు లేకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకిందా లేదా అని తెలియాలంటే టెస్టులు చేస్తేనే తెలుస్తోంది. చిరంజీవికి వచ్చినంత మాత్రానా ఆయనకు కలిసిన వారందరికీ కూడా కరోనా కచ్చితంగా సోకుతుందని అనలేము. అలా అని సోకకుండా ఉండదని కూడా చెప్పలేము. ఏదేమైనా మెగాస్టార్‌కు కరోనా రావడం ప్రగతి భవన్ వర్గాల్లో ఒకింత కలవరం మొదలైందనే చర్చ ప్రస్తుతం సర్వత్రా జరుగుతోంది.










