ప్రస్తుతం రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ డెబ్యూ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వెరైటీ ప్రేమకథా చిత్రాలు తీయడంలో మాస్టరైన తేజ .. ఆ సినిమాకి దర్శకుడు. ‘చిత్రం 1.1’ టైటిల్ తో ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. తేజ ను ఇండస్ట్రీలో డైరెక్టర్ గా నిలబెట్టిన ఉషాకిరణ్ మూవీస్ వారి ‘చిత్రం’ సినిమాకిది సీక్వెల్. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కి ఇది డెబ్యూ మూవీ అన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ‘చిత్రం 1.1’ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ ఓకే అయింది. అయితే ఒకటే సమస్యగా మారింది. హీరోయిన్ ఎంపిక. అభిరామ్ సరసన ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేయాలి అనే విషయంలో కొంతకాలంగా తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించాడట తేజ. ఇప్పటి పారితోషికం కన్నా బెటర్ అమౌంట్ ఆఫర్ చేశాడట. అయితే కృతికి వేరే కమిట్ మెంట్స్ ఉండడంతో.. డేట్స్ అడ్జెస్ట్ మెంట్ కుదర లేదట. అందుకే తేజ అంతటి వాడు అడిగినప్పటికీ ఆమెకి నో చెప్పక తప్పలేదట. దాంతో తేజ మరో కథానాయిక అన్వేషణలో పడ్డాడని టాక్.
నిజానికి తేజకి కొత్తవారితో సినిమాలు తీయడం కొట్టిన పిండి. ఇప్పటికే ఆయన చాలా మందిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కృతి శెట్టి అయితే సినిమాకి మంచి మైలేజ్ వస్తుందని ఆమెని సంప్రదించాడట. అందుకే అభిరామ్ సరసన కొత్తమ్మాయినే కథానాయికగా ఎంపిక చేయాలని తేజ నిర్ణయించుకున్నాడట. మరి అభిరామ్ సరసన ఎలాంటి అప్సరస హీరోయిన్ గా లభిస్తుందో చూడాలి.











