నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, ఎన్నికల అధికారులపై దురుసుగా ప్రవర్తించిన ఊటుకూరులోని ఓ వాలంటీర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే వైసీపీ నేతల ఒత్తిడితో అతనిపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వాలంటీరు వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ఎన్నికల అధికారులపైనే దురుసుగా ప్రవర్తించడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఎలా కొనసాగిస్తున్నారు…
క్రిమినల్ కేసులున్న వాలంటీరును విధుల్లో ఎలా కొనసాగిస్తున్నారని ఊటుకూరు గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులపై దురుసు ప్రవర్తనతోపాటు, ఆర్టీసీ బస్సును అడ్డుకుని వీరంగం వేసిన సదరు వాలంటీరుపై అధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. సదరు వాలంటీరుపై మరో మూడు కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మరోసారి వాలంటీరుపై ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.











