రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని పరాయి పాలకులను పారతోలాం. సొంత రాజ్యాoగాన్ని రాసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్నిఏర్పాటు చేసుకొన్నాం. ఇప్పుడు మన పాలన మనదే, మన బాగోగులు మనవే, మన బాధ్యత మనదే. నేడు నిరంకుశం, నియంతృత్వం పెరిగిపోయి మనవాళ్లే మనల్ని అణచి వేస్తుంటే, మన వాళ్ళే మనల్ని దోపిడీ చేస్తుంటే, మనం నిర్మించుకున్న అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ఉరి బిగిస్తుంటే ఎవరిని నిందించాలి?
అధికార మదంతో, విచక్షణా రాహిత్యంతో చీకటి జీవో తెచ్చి ప్రజాస్వామ్య హక్కుల పీక నులిమి వేసింది జగన్ ప్రభుత్వం. తన ఫీఠానికి బీటలు బారుతున్నాయన్నభయంతో బరితెగించిన జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ఎజెండాగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించ రాదంటూ అనుమతి నిరాకరిస్తూ బ్రిటీష్ కాలం నాటి యాక్టు 1861 ని ఉపయోగించి అర్ధరాత్రి చీకటి జీవో తెచ్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి తన వికృత రాక్షస రూపాన్ని బయట పెట్టుకొన్నది వైసిపి ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ప్రతిపక్షనాయకుడిగా, 28 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన నాయకుడిగా, 44 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా సొంత నియోజక వర్గం కుప్పంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడానికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే మన ప్రజాస్వామ్యం ఎందుకోసం?ఎవ్వరి కోసం?
కుప్పం ప్రజలు చంద్రబాబును తమ ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని తమను పాలించే భాధ్యతను ఆయనకు అప్పగించారు. కానీ చంద్రబాబును ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నకుప్పంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా అడ్డుకోవడం దారుణం. ఆయన సొంత నియోజక వర్గంలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకోవడం నేరమా? సమస్యలు తమ నాయకుడికి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకోవడం ఏమిటి?తమ నేత వద్దకు వస్తున్న ప్రజలను అడ్డుకొని విసక్షణ లేకుండా వారిని లాఠీలతో చితక బాది కేసులు అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యమా?రాచరికమా ప్రభుత్వం సమాధానం చెప్పాలి? దేశ చరిత్రలో ప్రతిపక్షాన్ని అణచి వేసి తాను బలపడేందుకు ప్రతి పక్షాల పై ఆంక్షలు విధించే దుస్సాహసానికి ఒడి గట్టింది జగన్ ప్రభుత్వం. తమ తప్పులు ఎత్తి చూపే మీడియా ఉండకూడదు. తమను ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇప్పుడు వారికి ఆనందంగా ఉండవచ్చు. కానీ ఎదో ఒక రోజు ఈ పరిస్థితి వారికి ఎదురుకాక తప్పదు.
ప్రతిపక్షాలు జగన్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి తెచ్చారు. జగన్ రెడ్డి పెత్తందారులను మించి పోవడమే కాదు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డిలో ఆవగింజంత కూడా ప్రజాస్వామ్య దృక్పధం కనపడదు. నిలువెల్లా నిరంకుశం, స్వార్ధమే. ప్యాక్షనిజం పడగ నీడలో ఆంధ్రప్రదేశ్ విల, విల లాడుతుంది. చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి బెంబేలెత్తిన జగన్ రెడ్డి కందుకూరు,గుంటూరు దురదృష్ట కరమైన సంఘటనలను సాకుగా చూపి చంద్రబాబు జనంలోకి వెళ్లకుండా కుట్ర పన్నారు. కానీ బందో బస్తు ఏర్పాట్లలో పోలీసులు దారుణ వైఫల్యం వల్లనే ఆ రెండు చోట్ల అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలుసుకోవాలి. తన అసమర్ధ పరిపాలనను కప్పి పుచ్చుకోవడానికి అణచి వేతనే కవచంగా ఎంచుకున్నది ప్రభుత్వం. ఒక పక్కన మా పరిపాలన బ్రమ్మాoడం అని,సంక్షేమ రాజ్య విధాతలమని, 175 సీట్లు గెలుస్తామని డాంబికాలు పలుకుతున్న జగన్ రెడ్డి, చంద్రబాబు జనంలోకి పోతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి?
160 ఏళ్ల కిందటి పోలీస్ చట్టానికి జీవో 1తో కోరలు తొడగడం అంటే జగన్ రెడ్డి బ్రిటీష్ పాలకుల దమన నీతికి ప్రతి రూపం అని చెప్పాలి. బ్రిటీష్ వారి కాలంలో కానీ,ఎమర్జెన్సీ లో కానీ ఇలాంటి నిర్భందాలు చూడలేదు. ఈ విధంగా పోలీసులు పనితీరుకు, వారు అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఎన్సీ ఆర్బీ 2021 నివేదిక కూడా వెల్లడించింది. భారత పోలీసు చట్టం 1861 ద్వారా మన దేశంలో పోలీసు వ్యవస్థ ఏర్పడింది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1902లో కొన్ని మార్పులు చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతకూడా 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి73 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ పోలీసు చట్టాలే, ఆ వ్యవస్థే నేటికీ కొనసాగుతూ ఉండటం దురదృష్ట కరం. నేటి నిరంకుశ పాలకులకు పోలీసులు అనుకూలంగా పని చేయడానికి అప్పటి చట్టాలే కారణం. దీంతో పోలీసులు కూడా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు.
పోలీస్ వ్యవస్థను వైసిపి పంజరంలో చిలుకను చేశారు.పోలీసులు తమ విధి నిర్వహణలో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సమానంగా వ్యవహరించవలసిన పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రతి పక్షాలను అణచి వేస్తున్నారు. గతంలో పోలీసులు ఎన్నడూ ఈ విధమైన వికృత రూపం ప్రదర్శించలేదు. కొందరు పోలీసుల అరాచకం హద్దులు దాటింది.తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డిజిపి గా నియమించుకొని మొత్తం పోలీసు వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాలకు రాళ్లెత్తే కూలీలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ,ఖాకీ లు రెండూ కలిసి ప్రజాస్వామ్య,రాజకీయ విలువలను సమాధి చేస్తున్నారు. జగన్ పాలనలో ఐపీఎస్ లు,వైపిఎస్ లు గా మారిపోయారు. ఎపి పోలీసులు విధానం ఎమెర్జెన్సీ ని తలపిస్తోందని, ఆ మధ్య బీహార్ కన్నా ఏపీ లోనే అక్రమ నిర్బందం ఎక్కువగా ఉందని,పోలీసులు చట్ట నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పక్షానికి సాగిల పడి వ్యవస్థ పరువుతీస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ప్రజల మానప్రాణాలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, సంస్థలను,ప్రతిపక్షాలను కాపాడాలి. అందరి పట్ల సమధర్మం పాటించి అందరిలో అభిమానాన్ని చూరగొనాలి. అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలి. చట్ట బద్దంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే పోలీసులుపై గౌరవం పెరిగి ప్రజాస్వామ్య వ్యవస్థ తలెత్తుకొంటుంది. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య మూలలను ధ్వంసం చేస్తుంది. తమ తప్పులు ఎత్తి చూపే మీడియా ఉండకూడదు. తమను ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండ కూడదు అన్న విధంగా ఆంక్షలు విధించే పాపకార్యానికి పూనుకొన్నది జగన్ ప్రభుత్వం. ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వ అనాగరిక చర్యను తీవ్ర సమస్యగా గుర్తించి ఈ ధోరణి ని అడ్డుకోక పొతే ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదు. కావునా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా సొంత నియోజక వర్గం కుప్పంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడానికి తిరిగే స్వేచ్ఛ లేక పోతె ఈ ప్రజాస్వామ్యం ఎందుకోసం?ఎవ్వరి కోసం? అని ప్రశ్నించాల్సి వస్తుంది.