కోదంరామ్ కు మద్దతివ్వాలా వద్దా అని తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ బరిలో ఉంటానంటూ అందరికంటే ముందే ప్రకటించుకున్న కోదండరామ్ తనతో ఎవరెవరు కలిసి వస్తారో అన్న అంశంపై లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో చెప్పిన విధంగా మహాకూటమిలోని నేతలు తనతో కలిసి వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎవరు వచ్చినా రాకున్నా…తను మాత్రం సొంతంగా అయినా ఎన్నికల బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
మద్దతు ఇవ్వాలా…వద్దా…
కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మహాకూటమిలో ఉన్న సమయంలో కోదండరామ్ కాంగ్రెస్ ఎలా చెబితే అలా విన్నారు. చివరకు ఆ పార్టీ కోసం తన టికెట్ కూడా వదులు కున్నారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ విషయం వచ్చే సరికి ఇవ్వాలంటూ కొంతమంది ససేమిరా అని చాలా మంది అంటున్నారు.
ఆశావహులను వదిలేస్తే ఎలా?
కాంగ్రెస్ జాతీయ పార్టీ…అనేక మంది ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ వారిని వదిలి పెట్టి కోదండరామ్ కు ఎలా మద్దతిస్తారని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ అంతర్గత సమావేశంలోనూ అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేక పోవడం … ఇప్పటికే ముఖ్యనేతలంతా పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కేడర్ ఎటువైపు ఉందో తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఇంతకూ బలమెంత? అదే సస్పెన్స్…
పార్టీలో కొంతమంది చెప్పినట్టుగా పోటీలో ఉంటే తమ బలం ఎంత ఉంటుంది అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ లలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ బలం తేలిపోనుంది. ఏ నాయకుడు ఎంత మెంబర్ షిప్ చేయగలడు… నిజంగా ఎంత మంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారన్నది చూసుకున్న తరువాతే పోటీలో ఉండాలా వద్ద అనేది తేల్చుకునే అవకాశం ఉంది.
తలోమాటతో తప్పని తలనొప్పి…
అయితే పార్టీలో భిన్నాభిప్రాయాలు అధిష్ఠానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ నేతలతో ఏకాభిప్రాయం సాధించలేక పోతున్నారు ముఖ్యనాయకులు. అందరిని ఏక తాటిపైకి తెచ్చి మద్దతు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని తేల్చే పనిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించారు. ఆయన పార్టీ నేతలతో పాటు కోదండరామ్ తో కూడా సంప్రదించాక నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలపనున్నారు. వీలైనంత త్వరగా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసే బాధ్యతను జీవన్ రెడ్డి తనపై వేసుకున్నారు. జీవన్ రెడ్డి ఇచ్చే నివేదికపై అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. జీవన్ రెడ్డి అభిప్రాయ సేకరణలో కోదండరామ్ కు మద్దతు ఇచ్చే అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారో.. గతంలో కోదండరామ్ కు ఇచ్చిన హామీ మేరకు మద్దతు నిస్తారా లేక… తమ అబ్యర్థిని బరిలో దింపి పోటీకి సై అంటుందో చూడాలి.











