ఎట్టకేలకు దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి పేరును టిఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్నరణం తరువాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు తెరాస పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థి పేరును ప్రకటించకుండా నాన్చుతూ వచ్చింది. అయితే కేసిఆరే.. స్వయంగా దుబ్బాక పోటీలో నిలుస్తున్న అభ్యర్థి పేరును ప్రకటించారు. రామలింగా రెడ్డి భార్య సుజాత పేరును ఆయన ప్రకటించడం జరిగింది.
మాపెళ్లి చేసింది కేసిఆరే..
ఈ క్రమంలో తన అభ్యర్థిత్వాన్ని కెసిఆరే ఖరారు చేయడంతో సోలిపేట సుజాత సంతోషం వ్యక్తం చేస్తూ కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. అయితే సిఎం కేసిఆర్ గురించి ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ సారు మాకు కొండంత ధైర్యమన్నారు. మా పెళ్లి, తమ పిల్లల పెళ్లిళ్లు చేసింది కూడా కేసిఆర్ అని తెలిపారు. నా భర్త చనిపోతే ఇంటికి వచ్చి తమ కుటుంబానికి ధైర్యాన్నిచ్చారని సుజాత కెసిఆర్‌పై తనకున్న అభిమానాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించినందుకు, అలాగే తనకు మద్దతు పలుకుతున్న మంత్రి హరీష్‌రావుకు, టిఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ నియమాలకు అనుగుణంగా నడుచుకుంటూ తన భర్త ఆశయాలను నెరవేర్చేలా ముందుకుసాగుతానని ఆమె తెలిపారు.
దుబ్బాక ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకుండా తెరాస నిన్నటి వరకు ఒక సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. తాజాగా అభ్యర్థి పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. మంత్రి హరీష్ రావే స్వయంగా సుజాతను వెంటబెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా హరీష్ ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు.