సెప్టెంబర్ 2 వై.ఎస్.ఆర్ వర్థంతి…, చీరాల రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్ ఇద్దరూ పేర్లు ప్రస్తావించకుండానే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ఉద్దేశించి మరొకరు మాటల్లో నిప్పులు చెరిగారు. వై.ఎస్.ఆర్, వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న కరణం వెంకటేష్, చీరాలకు స్వేచ్ఛను ఇస్తామని వాగ్దానం చేశామని, ఇక్కడ గతంలో మాదిరి దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడాలంటే కుదరదని, చూస్తూ ఊరుకునే వాళ్లు ఎవరూ లేరని పరోక్ష ఆమంచిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
దీనిపై చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఘాటుగా స్పందించారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా..? జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా…? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నా అని ఆమంచి మీడియాకు తెలిపారు.
వేరే సందర్భం దొరకలేదా…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు రాజశేఖరరెడ్డిని వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తారు. నివాళి అర్పిస్తారు. ఆమంచి- కరణం ఈ ఇద్దరు నాయకులకు.. ఈ సందర్భం తప్పితే గొడవలు పెట్టుకోడానికి వేరే ముహూర్తమే దొరకలేదా.. అని కార్యకర్తలు ఈసడించుకుంటున్నారు. కరణం వెంకటేష్ చేరికతో చీరాల నియోజకవర్గ రాజకీయాలన్నీ ఆమంచి- కరణం ముఠాల మధ్య రాజకీయాలుగా మారిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ పరువే బజార్న పడుతోంది.











