ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు శరాఘాతంలా తగలనుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఉచిత విద్యుత్ కు మంగళం పాడడానికే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విమర్శలకు జడిసిన ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు మాజీ సీఎస్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంను మీడియా ముందుకు పంపింది. కేంద్ర సంస్కరణల అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పేమి లేదని ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలే కేంద్రం డీబీటీని అమలు లోకి తీసుకు వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా రైతుల అకౌంట్ లో డబ్బులు వేయాలని కేంద్రం చెబుతోంది.
వీలైనంత వరకు పథకాలకు సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా ఏపీ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దపడింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మోటార్లు, బోర్లు తక్కువ. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న అమలు నిర్ణయంతో రైతులు వాడుకున్న కరెంటుకు బిల్లులు వస్తాయి. ఆ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్ లో వేసే డబ్బులు ద్వారా చెల్లించాలి. అప్పుడే ‘ఉచిత విద్యుత్’ పథకానికి ఆన్సర్ బిలిటీ వస్తోందని కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. గ్యాస్ సబ్సిడీ లాగా మనం గ్యాస్ బుక్ చేస్తే సబ్సిడీ అమౌంట్ అకౌంట్ లో పడినట్లే రైతు కరెంటు ఎంత వాడితే అంత డబ్బులు వచ్చి పడతాయి. దీని ప్రధాన ఉద్దేశం సబ్సిడీలను తగ్గించడమే. కేంద్రం విధి విధానాలను అమలు చేయవలసిన బాధ్యత మాపై ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకురావాల్సి వచ్చిందని అజేయ కల్లం వెల్లడించారు. రైతులకు నగదు బదిలీ చేస్తామని భరోసా ఇచ్చారు.
నగదు బదిలీ కోసం రైతుల చేత కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించి అందులో అమౌంట్ వేస్తామని పేర్కొన్నారు. కనెక్షన్లకు బిగించిన మీటర్ల ద్వారా బిల్లులు వస్తాయని అందుకు తగ్గట్టుగానే వారి అకౌంట్ లో డబ్బులు పడతాయని ఆయన చెప్పుకొచ్చారు. అకౌంట్ నుంచి డిస్కం డబ్బులను కట్ చేసే విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో రైతులకు ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. మీటర్లు కూడా ఉచితం గానే తాము బిగిస్తామని కల్లం స్పష్టం చేశారు. మోసం చేయడం అనేది సీఎం జగన్ రక్తంలోనే లేదని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ కష్టాలు చెప్పినా మాట ఇచ్చాం చేసి తీరవలసిందే అంటూ జగన్ చెప్పారని ఆయన చెప్పారు.











