ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇటీవల మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే లింక్డ్ ఇన్ లో ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు ట్విటర్ లో కూడా వైరల్ అవుతోంది. పైగా జగన్ మోహన్ రెడ్డి అసమర్థతను వేలెత్తి చూపుతోంది. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ముందు అనిల్ కుంబ్లే ఓ క్రీడాకారిణిని ఉద్దేశిస్తూ లింక్డ్ ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. ఒలింపిక్స్ క్రీడలు సమీపిస్తున్న వేళ, 100 మీటర్ల హర్డిల్స్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ గురించి అనిల్ కుంబ్లే ప్రస్తావించారు.
‘‘బెంగళూరుకు చెందిన TENVIC నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరడానికి జ్యోతి యర్రాజీని ఆంధ్రప్రదేశ్‌లోని గాండీవ ప్రాజెక్ట్ కింద గుర్తించారు. అట్టడుగు స్థాయిలో దాగి ఉన్న ఈమె ప్రతిభను వెలికితీసేందుకు చంద్రబాబు దూరదృష్టితో కూడిన కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కారణంగానే ఆమె క్రీడలో రాణించడానికి పునాదిని వేశాయి. జ్యోతి TENVICలో సంపూర్ణ శిక్షణ పొందింది. ప్రపంచ వేదికపై జ్యోతిని చూడడం TENVICలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణం’’ అని అనిల్ కుంబ్లే ఒక సుదీర్ఘ పోస్టు ఆమె గురించి చేశారు. అమెను వెలికి తీసిన ఘనత చంద్రబాబుదే అని అనిల్ కుంబ్లే ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గతసారి సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన గాండీవ ప్రాజెక్టు గురించి తెరపైకి వచ్చింది.
అప్పట్లో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఒక యువతి ఏకంగా ఒలింపిక్స్ వరకూ వెళ్లగలిగింది. అదే సమయంలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా ఏ ప్రయోజనమూ లేకుండా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ కిట్ల పంపిణీలో అప్పటి క్రీడల మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ చేతివాటం ప్రదర్శించుకోవడం తప్ప దానివల్ల యువతకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, చంద్రబాబు విజన్ కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. ఒలింపిక్స్ ని కూడా నిర్వహించే సత్తా భారత్ కి.. అందులోనూ ఏపీకి రావాలనేది ఆయన ఆలోచన. ఈ విషయాన్ని గతంలోనే ఓ సందర్భంలో చంద్రబాబు చెప్పేవారు. అది విని నవ్వుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ, సాధ్యం కాని ఎన్నో పనులను చేసి చూపించిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. పీవీ సింధు తొలిసారి ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పుడే అప్పటి ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు, ఆమెకు అకాడమీ ఏర్పాటు కోసం ఏపీలో స్థలాలు కూడా కేటాయించారు. అలా చేయడం ద్వారా మరింత మందిని క్రీడాకారులను వెలికితీయొచ్చనేది ఆయన ఆలోచన. గతంలో కూడా చెస్ చాంపియన్స్ అయిన హరికృష్ణ, హారికను ఎంకరేజ్ చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం కోసం చంద్రబాబు ఆలోచనలే డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా అనిల్ కుంబ్లే ద్వారా ఆ విషయం మరోసారి స్పష్టం అయింది.











