ఏపీలో చంద్రబాబు గత కొన్ని రోజులుగా వరుసగా విడుదల చేసిన శ్వేతపత్రాలను చూసి అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ, ఇప్పుడవే జగన్ కొంప ముంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ శ్వేతపత్రాలు అమిత్ షా చేతికి చేరినట్లుగా.. తద్వారా గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి తన స్వార్థం కోసం చేసిన పనులు కేంద్ర పెద్దలకు తెలిసిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలు ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతున్నాయి.
ముఖ్యంగా ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ వంటి కీలక అంశాల్లో వైసీపీ అనేక పెద్ద తప్పిదాలే చేసింది. అగ్ర నాయకత్వం నుంచి జిల్లాల స్థాయిలో అనేకమంది నాయకులు దొరికినంత దండుకున్న విషయం అందరికీ తెలిసిందే. గనుల శాఖలో ఇసుక, ఎర్రమట్టి తరలింపు విషయాల్లో వైసీపీ నాయకులు బాగానే సొమ్ములు చేసుకున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాలను ఇటీవలే జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. దాంతో వైసీపీ నాయకులు కంటి మీద కునుకు లేకుండా ఉండాల్సి వస్తోంది. గతసారి తమకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలు.. ఈసారి కాస్త తగ్గినా తమకే అధికారం కట్టబెడతారని జగన్ సహా వైసీపీ నేతలంతా ఊహించారు. కానీ, వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూలకు కూర్చోబెట్టారు ప్రజలు.
ఇప్పుడు ఈ శ్వేత పత్రాల వ్యవహారాన్ని ఎదుర్కోవాలంటే.. వైసీపీ నేతలకు రెండు దారులు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం పెట్టబోయే కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లడం కాగా.. తమకు రక్షణ కల్పించేలా బీజేపీలోకి వెళ్లిపోవడం రెండోది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నాయకులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఎవరూ ఉండరు. పార్టీలు మారిపోవడం సహజమే.. అటు కేంద్రంలోనూ అదే పరిస్థితి ఉంది. అయితే, వైసీపీ నేతలు ఎంత మంది పార్టీలు మారినా, కొందరికి మాత్రం ఏ పార్టీల్లోకి దారులు ఉండని పరిస్థితి ఉంది. అధినేత జగన్ మెప్పు కోసం ఇన్నాళ్లు ప్రయత్నించిన కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారికి ఏ పార్టీలోనూ చోటు ఉండదు.
అయితే, జగన్ రెడ్డిపై ఇప్పటికే ఉన్న అక్రమాస్తుల కేసులతోపాటు లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ వంటి కేసులు కూడా పడనున్నాయి. దీంతో తన కేసుల విషయాన్నే జగన్ చూసుకునేందుకు సమయం సరిపోదు కాబట్టి.. ఇక పార్టీని ఏం పట్టించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి చాలామంది వైసీపీ నేతలు పార్టీలు మారడం ఖాయం అని అంటున్నారు. జగన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా.. శ్వేతపత్రాల ద్వారా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ వాటిద్వారా కేంద్రం నిజంగానే చర్యలు తీసుకుంటే జగన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మరుగున పడినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.











