రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల ప్రతి అడుగును ఎప్పటి కప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారు వాలంటీర్ల ముసుగులో వున్నవైసిపి కార్యకర్తలు. జగన్ రెడ్డి నియమించుకున్న సేవకులు ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకొంటూ ప్రజలవివరాలు అధికార పార్టీకి అందిస్తున్నారు.
వాలంటరీ వ్య వస్థను తమ వశం చేసుకొని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి రాళ్లెత్తే కూలీలుగా మార్చారు. అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడుతుంది. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది,వాలంటీర్లను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంప్లాయిమెంట్ సర్వేలో వారికి కేటాయించిన కుటుంబాల్లో అక్షరాస్యులు ఎంత మంది వున్నారు? వృత్తి రీత్యా ఎక్కడ వుంటారు?ఓటు నమోదు చేసుకున్నారా?ఏ రాజకీయ పార్టీ అంటే మీకు ఇష్టం? మీ ఆయనకు ఎందరు భార్యలు? అనే వివరాలు సేకరిస్తున్నారు.
ఎంప్లాయి మెంట్ సర్వేలో రాజకీయపార్టీ ఇష్టాలను, వ్యక్తుల పర్సనల్ విషయాలు తెలుసుకోవడం ఏమిటి? ఇది రాజ్యాoగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కుకి,భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం కలిగించడమే. కావునా వాలంటీర్లు సేవ చేస్తున్నది ప్రజలకు కాదు. వైసిపి కి సేవ చేస్తున్నారు. పధకాలను ప్రజలకు సక్రమంగా అందించే పేరుతొ వాలంటీర్లను నియమించుకొని వారితో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొంటున్నారు జగన్ రెడ్డి . ఎన్నికలు ఏవైనా వాలంటీర్లు అధికారపార్టీ నాయకుల తరపున ప్రచారం దగ్గర నుండి,ఓటర్లకు డబ్బులు పంపిణీ వరకు వారే చక్కబెడుతున్నట్లు సమాచారం . అంతే కాదు పథకాలన్నీ జగన్ రెడ్డి ఇస్తున్నారని,మళ్ళీ జగన్ సియం అయితేనే పధకాలు అమలు అవుతాయని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జగన్ గెలవక పొతే ఇళ్ల స్ధలాలు రద్దు చేస్తారని లబ్దిదారులను బెదిరిస్తున్నారు.
ప్రభుత్వ ఖర్చుతో పార్టీ జెండాలు మోయిస్తూ వారిని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూ ఏటా రూ 4,వేలకోట్లు దుర్వినియోగం చేస్తున్నారు.ఇప్పుడు వాలంటీర్లే కాకుండా రానున్న ఎన్నికల్లో వాడుకోవడానికి కొత్తగా గృహ సారధులను నియమించుకొంటున్నారంటే జగన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పాతరెయ్య బోతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. గ్రామ సారధులను రాజకీయ ప్రయోజనాలకోసమే నియమించుకొంటున్నారు. రానున్న ఎన్నికల్లో వీరి ద్వారా పెద్దఎత్తున నగదు పంపిణి చేయించి ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇంత అప్రజాస్వామిక విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు.ప్రజా స్వామ్య బద్దంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసేలా నానా విధ అక్రమాలకు తెగపడుతున్నారు. వాలంటీర్లు ప్రజాధనాన్ని జీతాలు తీసుకొంటూ పాలక పక్షానికి ఊడిగం చేస్తున్నారు. ఏ విధంగా అయినా తిరిగి అధికారంలోకి రావాలన్నది సియం జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం. అందుకోసం అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. కావునా వాలంటీర్లను వ్యవస్థను రద్దు చేసే విధంగా కోర్టుల ద్వారా ప్రతిపక్ష పార్టీలు పోరాటం చెయ్యాల్సిన అవసరం వుంది.వాలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి ప్రజాసామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం పై కూడా వుంది.