తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు లేదని ప్రజలు వాపోతున్నారు. అధిక ధరలు,పన్నులు సామాన్యులకు పెనుభారంగా పరిణమించి వారి జీవితాల్లో గాడాంధకారం అలుముకొన్నది. ఈ ధరాఘాతాన్నిఎలా భరించాలి అంటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పేద,మధ్య తరగతి ప్రజల పై అధిక ధరల భారం మోయలేనంతగా ఉంది.పెట్రోలు ,డీజీలు,గ్యాస్, ఆహార,నిత్యావసర వస్తువులు,కూరగాయలు సమస్త వస్తువుల ధరలు భరించలేనంతగా పెరిగాయి .జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ళ పరిపాలన సమస్తం ప్రజా ఫీడన పరాయణమే తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. బడుగు జీవులకు భాధలు తప్ప బతుకు లేకుండా చేశారు.భాధ్యత లేని జగన్ ఏలుబడిలో పెరుగుతున్న ధరల దాటికి,పన్నుల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి. ప్రజల పై ఏడా,పెడా పన్నుల భారం మోపి జలగల్లా జనం రక్తాన్ని కాసులుగా పిండుకొంటున్నారు. ఒక పక్కన ధరలు ఆకాశాన్ని అంటుతుంటే,ప్రభుత్వం ప్రజల పై పన్నులు మీద పన్నులు వేసి డబ్బులు గుంజుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పడం అంటే ఎవరి డబ్బుతో ఎవర్ని బాగు చేస్తున్నట్లు ?ప్రభుత్వం సంక్షేమం పధకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్నది ఎంత?
పన్నుల రూపంలో, మరియు మధ్యం ద్వారా గుంజుకొంటున్నది ఎంతో ప్రజలు కూడా ఒకసారి అర్ధం చేసుకోవాలి.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.పెట్రోలు,డీజీలు పై పన్నులు తగ్గించడానికి అంగీకరించని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఒక శాతం ఆహార ధరల పెరిగితే కోటి మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి జారుకొంటారని ఆ మధ్య ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ హెచ్చరించారు.జగన్ చెబుతున్న సంక్షేమం ఏమో కానీ సమస్త ధరలూ పెరిగి ధరాఘాతంతో రాష్ట్రంలో సామాన్యులు,మధ్యతరగతి ప్రజలు మాత్రం దివాళా అంచుకి చేరారు. జగన్ రెడ్డి అరకొర సంక్షేమం అమలు చేసి తానూ సంక్షేమ రాజ్య విధాతగా ప్రచారం చేసుకొంటూ జనం చెవిలో ఎలా పూలు పెడుతున్నారు.
జగన్ కి జనం భాధలు పట్టడం లేదు.అధిక ధరల మంటల్లో బడుగుల బతుకులు కాలిపోతున్నాయి.పంట దిగుబడి బాగానే వున్నా మార్కెట్ లో బియ్యం ధర కేజీ రూ 50 నుంచి 55 వరకు పలుకు తున్నది ఇక నిత్యావసర వస్తువుల ధరలు స్వతంత్ర భారతంలో ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటి సారి. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు, వంటనూనెల ధరలు, అన్ని రకాల పప్పులు ధరలను ఒకసారి పరిశీలిస్తే 2014 లో కందిపప్పు కేజీ రూ 75 వుండగా,నేడు కేజీ కంది పప్పు రూ 130 అయింది,పెసర పప్పు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 120 కి చేరింది.మినప గుండ్లు కేజీ రూ 70 వుండగా నేడు కేజీ రూ 130 పెరిగింది. పల్లీలు కేజీ రూ 80 వుండగా నేడు కేజీ రూ 130 కి చేరింది .వేరుశనగ నూనె కేజీ రూ 110 వుండగా నేడు 170 అయింది.సన్ ఫ్లవర్ ఆయిల్ కేజీ రూ70 వుండగా నేడు కేజీ రూ 150 కి పెరిగింది. సామాన్యులు వాడే పామాయిల్ ధర అంతే వారికి అందుబాటు లేదు .
పంచదార కేజీ రూ 26 వుండగా నేడు కేజీ రూ 50 అయింది.చింతపండు కేజీ రూ 100 వుండగా నేడు కేజీ రూ 250 అయింది. కూరగాయల ధరలు మండి పోతున్నాయి.పెట్రోలు లీటరు రూ 76 వుండగా నేడు లీటరు 110 కి చేరింది.డీజీలు లీటరు 70 వుండగా నేడు 100 అయింది.గ్యాస్ బండ రూ 450 వుండగా నేడు గ్యాస్ బండ రూ 1100 దాటింది.లారీ ఇసుక రూ 10 వేలు వుండగా,నేడు లారీ ఇసుక రూ 40 వేల నుండి రూ 50 వేలు అమ్ముతుంది.స్టీలు,సిమెంట్ ధరలు భగ్గు మంటున్నాయి.సిమెంట్ బస్తా రూ 450 కి చేరింది.టన్ను స్టీలు ధర 60 వేలు పలుకుతుంది.ధరలు పెరిగి ప్రజలు ఆహాకారాలు చేస్తున్నా పెరిగిన దరల పై ముఖ్యమంత్రి జగన్ ధరల పెరుగుదల పై సమీక్షీoచి ఎరుగరు.
భాధ్యతలేని జగన్ ఏలుబడిలో ధరల ధాటికి,పన్నుల పెంపుకు,విద్యుత్తుచార్జీలు,ఆర్టీసీ చార్జీల బాదుడుకు ప్రజల జీవితాలు గిడస బారాయి? రాష్ట్ర ఖజానా కుదేలు కావడం తో పధకాలు అమలు చెయ్యడం కోసం అని సమస్త పన్నులు,చార్జీలు పెంచి ప్రజలను తెగబడి దోచుకొంటున్నారు.ఒక ప్రామాణికం లేకుండా ఆస్తి పన్ను,ఇంటి పన్ను,చెత్త పన్ను,కుళాయి పన్ను,మరుగుదొడ్డి పన్ను, ఓటిఎస్ పన్ను,ఆర్టీసీ ఛార్జీలు,విధ్యుత్తు ఛార్జీలు, పెట్రోలు,డీజీలు పై వ్యాట్ పెంచి మూడున్నరేళ్లలో రూ 90 వేల కోట్ల భారం ప్రజల పై మోపారు.జగన్ పాలనలో సమస్త ధరలు పెరిగి జనం దిక్కులేని వారు అయ్యారు..
ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరోవైపు పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు, పంచదారకు ఎగనామం పెట్టింది జగన్ ప్రభుత్వం. పండగొస్తే రేషన్ షాపుల్లో సంక్రాంతి కానుక కింద అదనంగా సరుకు లిచ్చిoది గత ప్రభుత్వం.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పధకానికి గండి కొట్టి పేదల పొట్టకొట్టింది. ప్రతి నెలా ఇచ్చే రేషన్ సరుకులకు కత్తెర వేసి పేదలకు కాస్తో కూస్తో అందుతున్న ఆసరాకు గండికొట్టారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యంతో పాటు కిలో కందిపప్పు, అర కిలో చక్కెర పంపిణీ చేస్తామంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక కోటీ 45 లక్షల కార్డులుండగా, 14.5 వేల టన్నుల కందిపప్పు, 7 వేల టన్నుల పంచదార సేకరించాలి. కానీ పౌరసరఫరాల శాఖ వద్ద పది శాతం నిల్వలే ఉన్నాయి. అందరికీ ఎలా పంపిణీ చేస్తారు? కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకునే ఎత్తేగా? సరఫరాదారులకు పాత బకాయిలు పేరుకు పోయినందున సేకరణ జరగలేదంటున్నారు.
పేదలకు అందించే కొద్దిపాటి సరుకులకయ్యే సొమ్ముకూడా ఖజానాలో లేదు. కందిపప్పు, చక్కెర పంపిణీ అస్తవ్యస్తంగా తయారైందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. కందిపప్పు 30 శాతం మందికి, పంచదార 70 శాతం మందికే అందుతున్నాయి. అదేంటంటే, పేదలు తీసుకోవట్లేదని సాకులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక మాదిరి క్వాలిటీ కందిపప్పు కిలో రూ.110 పలుకుతోంది. అదే వాల్‌మార్ట్, రిలయన్స్, వంటి సూపర్ బజార్లలోనైతే రూ.140. అంత ధర పెట్టి పేదలు కొని తినలేకపోతున్నారు. తక్కువ ధరకు వచ్చే రేషన్ దుకాణాల వంక ఆశగా చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వమేమో డిమాండ్ లేదని తప్పించుకుంటోంది. ఇచ్చే అరకొరకూ ధర పెంచేసింది. రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.40 వున్నధరను రూ.67 చేశారు.
పంచదార రూ.20 కాస్తా రూ.26 అయింది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయల వంటి 14 రకాల నిత్యావసరాలను అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒకటీ రెండు సరకులకూ కోతలు పెట్టడం పేదల పక్షపాతం ఎలా అవుతుంది? ఇంటింటికీ వలంటీర్ల ద్వారా ప్యాకింగ్ సంచుల్లో రేషన్ సరఫరా చేస్తామని చేతులెత్తేసింది. సన్న బియ్యం అని చెప్పి మాట మార్చి తినగలిగే నాణ్యమైన బియ్యం అంది. ప్రత్యేక వాహనాలను వీధి మూలమలుపుల్లో నిలబెట్టి రేషన్ తీసుకోమంటోంది. కూలి పనులు చేసుకొనే బీద బిక్కి రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చింది. రేషన్ డీలర్ల వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది.
ఎ.పి.లో రేషన్ కార్డుల ఏరివేత చేపట్టి ఏడాదిలో నాలుగు లక్షల కార్డులు తగ్గించారు. సచివాలయాల్లో కొత్త కార్డుల జారీ జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ప్రభుత్వం భారాన్ని తగ్గించుకునేందుకు పేదల కూటికి కోతలకు దిగుతోంది. ప్రతిపక్షనాయకుడిగా జగన్ వున్నప్పుడు పెట్రోలు,డీజీలు పై బాదుడే,బాదుడు అంటూ గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.మన రాష్ట్రంలోనే పెట్రోలు,డీజీలు పై వున్న పన్నులు ఏ రాష్ట్రంలో లేవని గగ్గోలు పెట్టారు.నేడు జగన్ ప్రభుత్వం పెట్రోలు పై 31 శాతం,డీజీలు పై 22.5 శాతం వ్యాట్ విధించి ప్రజల నడ్డి విరుస్తుంది.అత్యధిక పన్నులు ఏపి లోనే ఉన్నాయి. పెట్రోల్‌పై వ్యాట్ 31 శాతం, డీజిల్‌పై వ్యాట్ 22.25 శాతం. ఇవి కాకుండా లీటర్‌పై రూ.4 సెస్, రూపాయి రోడ్ డెవలప్‌మెంట్ సెస్ వసూలు చేస్తున్నారు. అత్యధిక పన్నులున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది.
అందుకే మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు ధరలు ఎక్కువ. కేంద్రం పన్నులు పెంచడంతో ఆదాయం పెంచుకుంటున్న ఎపి ప్రభుత్వం, సెస్‌లు, సర్‌ఛార్జీలలో కేంద్రం వాటా ఇవ్వకపోయినా పెద్దగా మాట్లాడట్లేదు. ఇదే సమయంలో అనేక రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోగా ఆంధ్రప్రదేశ్ పన్నులు తగ్గించేందు.పెట్రోలు,డీజీలు, గ్యాస్ ధరలే కాదు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను కాల్చుకు తింటున్న తరుణంలో సర్ధుబాటు వ్యయం పేరిట భారీగా విధ్యుత్తు చార్జీలు 7 సార్లు పెంచి మూడేళ్ళలో ఒక్క విధ్యుత్తు రంగంలోనే దశల వారీగా,రక,రకాల పేర్లతో ప్రజల పై రూ 17 వేల కోట్లు చార్జీల భారం మోపారు. ప్రజలు ఉపాధి కోల్పోయి ప్రజలు జీవనం దుర్భరంగా మారింది.ఈ పరిస్థితుల్లో ప్రజలకు రాయితీలు ఇచ్చి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు,పన్నులు,ఛార్జీలు పెంచి ప్రజా జీవనం మరింత దుర్భరం చెయ్యడం అమానుషం.
ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు ఉపయోగ పడని తాత్కాలిక,అరకొర తాయిలాల అమలును మద్యం అమ్మకాలు ద్వారానే తానూ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాను అన్నారు జగన్ రెడ్డి.పేద కుటుంబాలను ఛిద్రం చేసే మద్యం డబ్బుతో చేసేది సంక్షేమం అలా అవుతుందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. సంపూర్ణ మద్యనిషేధం వల్లే వేసి గద్దెనెక్కాక నాసిరకం మద్యంతో మార్కెట్లను ముంచెత్తి కాపురాలను గుల్ల చేస్తూ,ఖజానా నింపుకోవడం సంక్షేమం ఎలా అవుతుంది?పన్నులు భారాన్ని,చార్జీల భారాన్ని పెంచుతూ ప్రజల జేబులు గుల్ల చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుంది?నవరత్నాలను మద్యం ఆదాయంలో ముంచి బడుగుల బతుకులు బుగ్గి చెయ్యడం సంక్షేమం ఎలా అవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.