వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో కేసులో చిక్కుకున్నాడు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసు ఎదుర్కొంటున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన నిర్వహిస్తున్న హవాలా రాకెట్ బయటపడినట్లు తెలుస్తోంది. వర్మ సొంత నిర్మాణ సంస్థ లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులతో పాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని మరో అభియోగం నమోదైంది.
శివ, సత్య, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఆర్జీవీ.. కెరీర్ చివరి దశలో వరుస ఫ్లాపులతో బూతు సినిమా డైరెక్టర్‌గా మారాడు. అయితే బీ గ్రేడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను మెప్పించలేకపోయిన రామ్ గోపాల్ వర్మ.. పొలిటికల్ ప్రోపగాండా సినిమాలు తీసి లేని సమస్యలు కొని తెచ్చుకున్నారు. వైసీపీ అండతో చరిత్రను వక్రీకరిస్తూ వరుస సినిమాలు తీశారు. 2019 ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో టీడీపీ అధినేత చంద్రబాబును నెగిటివ్ రోల్లో చూపిస్తూ.. జగన్‌ని ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇక 2024 ఎన్నికల ముందు వ్యూహం పేరుతో మరో సినిమా వదిలారు. ఇందులో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్‌ని పోలిన వ్యక్తులను కాస్టింగ్ చేయడం మరింత వివాదాస్పదమైంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ టీడీపీ, జనసేన అగ్రనాయకులపై వర్మ చేసిన పోస్టులు.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొన్నాయి.
టీడీపీ, జనసేన కూటమిని దెబ్బతీయడానికి రామ్‌గోపాల్ వర్మ పన్నిన ‘వ్యూహం’ ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో వర్మ బూతు రాతలు, మార్ఫింగ్ పోస్టులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫోటోల మార్ఫింగ్‌పై నమోదైన కేసులో.. ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం లెక్క చేయని వర్మ.. మీడియా ట్రయల్ నిర్వహిస్తూ తన తప్పేమీ లేదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసు హైకోర్టులో ఉండగా.. మీడియా ట్రయల్స్ నిర్వహించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన కోర్టులకూ ఆర్జీవీ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు. నెక్ట్స్ హియరింగ్ ఈ అంశం వర్మకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఏపీ పోలీసులు ప్రారంభించిన విచారణలో వర్మకు సంబంధించిన ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటపడినట్లు తెలుస్తోంది. ఆర్జీవీ ఫిల్మ్ ఫ్యాక్టరీ ట్రాన్సాక్షన్స్ పరిశీలించిన పోలీసులకు హవాలా లావాదేవీల లింకులు దొరికాయట. ఇంకేముంది హవాలా తీగ లాగి రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయనకు ఫండింగ్ చేస్తున్న వాళ్ల డొంక కదిలించడానికి ఏపీ సీఐడీ రంగంలోకి దిగిపోయింది. సోషల్ మీడియాలో బూతు పోస్టులను సమర్ధించుకున్నంత తేలిగ్గా.. హవాలా రాకెట్ నుంచి తప్పించుకోవడం జరిగే పని కాదు. మొత్తం మీద ఏపీ పోలీసులు ఆర్జీవీని ఏదో ఒక కేసులో అరెస్టు చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఇప్పటికైనా పోలీసులకు సహకరిస్తే ఈ కేసులతో ఆగొచ్చు.. అలా కాదని అడ్డంగా వాదిస్తూ.. మొండికేస్తే రామ్‌గోపాల్ వర్మపై మరిన్ని కేసులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.