టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనను తాను విజనరీనని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులకు బాబు మాటలు రుచించకపోవచ్చు గానీ… చంద్రబాబు విజన్ తెలుగు నేలలో అద్భుతాలను సృష్టించింది. ఇదేదో చంద్రబాబు అంటే వల్లమాలిన అభిమానం కలిగిన టీడీపీ కార్యకర్తో… లేదంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన నేతో చెప్పిన విషయం కాదు. లోక్ సభ సభ్యుడిగా, బీజేపీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న నేతగా కొనసాగుతున్న తెలంగాణ యువ నేత, నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజన్ వల్ల సాక్షాత్కరించిన అద్భుతాలను ఏదో అలా అదాటుగా చెప్పారేమోలే అనుకులంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే… చంద్రబాబు విజన్ ను ఆకాశానికి ఎత్తేసిన అరవింద్… చంద్రబాబు విజన్ వల్ల కలిగిన లాభాలను అలా ఏకరువు పెట్టారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాలను వెల్లడించారు.
తెలంగాణకు చెందిన అరవింద్ ఏపీ వ్యవహారాల్లో పెాద్దగా జోక్యం చేసుకోరు. తన నియోజకవర్గం గురించి… తన రాష్ట్రం గురించి మాత్రమే ఆయన మాట్లాడతారు. తనది కాని విషయంలో కాళ్లూ వేళ్లూ పెట్టే విషయంలో అరవింద్ ఎప్పుడూ అల్లంత దూరంలో ఉంటారని చెప్పాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమకాలీకుడు, ఆయనతో కలిసి కాంగ్రెస్ విజయాల్లో కీలక భూమిక పోషించిన ధర్మపురి శ్రీనివాస్ కుమారుడైన అరవింద్… తండ్రి కాంగ్రెస్ నేత అయినప్పటికీ తాను మాత్రం బీజేపీతో రాజకీయ ప్రస్తానం కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఏ రాజకీయ నేత గురించి గొప్పలు చెప్పడమో, లేదంటే కప్పదాటు విమర్శలు చేయడమో అరవింద్ కు చేతకాదు. అలాంటి నేత స్వయంగా చంద్రబాబు విజన్ ను విశదీకరించిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణలో అటు బీఆర్ఎస్ అయినా., ఇటు కాంగ్రెస్ అయినా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా… చంద్రబాబు విజన్ గురించి ఆసక్తికర వాదనను వినిపించారు. చంద్రబాబు విజన్ తో ఎన్నెన్ని ఉపయోగాలు కలిగాయన్న విషయాన్ని ఆయన ఉదాహరణలతో సహా వివరించడం గమనార్హం.
అమెరికాకు వెళితే… ఏ న్యూయార్క్ లోనో, మన్ హట్టన్ లోనో అలా ఐటీ కంపెనీల ముందు నిలిచి తెలుగులో గలగలా మాట్లాడితే… అక్కడి ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో ముగ్గురు, నలుగురు వెంటనే మనతో మాట్లాడతారని అరవింద్ అన్నారు. దీనికి కారణం చంద్రబాబు విజనేనని కూడా ఆయన చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మీద 1990 దశకంలో చంద్రబాబు పెట్టిన శ్రద్ధ వల్లే…నేడు అగ్రరాజ్యం అమెరికాలోని ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో ముగ్గురు, నలుగురు తెలుగు వారు ఉంటున్నారని ఆయన చెప్పారు. అయినా చంద్రబాబు సీఎం కాక ముందు ఉమ్మడి ఏపీలో ఓ నాలుగు వైద్య కళాశాలలు, ఏడెనిమిది ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే ఉన్న విషయాన్ని అరవింద్ .ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళాశాలల్లో ఎంతమందికి అవకాశం వస్తుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయ్యాక… ఐటీ రంగానిదే భవిష్యత్తు అన్న అంచనాకు వచ్చిన చంద్రబాబు…అనతి కాలంలోనే రాష్ట్రంలో 70 నుంచి 80 ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా… తాను విద్యార్థిగా ఉన్నానని, చంద్రబాబు ముందు చూపుతో తీసుకున్న చర్యలన్నింటినీ తాను కళ్లారా చూశానని అరవింద్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు లేకుంటే ఇవన్నీ ఎప్పుడు జరిగేవని కూడా ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు ఓ విజన్ తో ముందుకు సాగే నేత అని, భవిష్యత్తులో ఏఏ రంగాలు ప్రపంచాన్ని ఏలతాయన్న విషయంపై ఆయనకు సమగ్ర అవగాహన ఉందని కూడా అరవింద్ అన్నారు. నిజమే మరి… చంద్రబాబు సీఎం కాకముందు నాటి ఉమ్మడి ఏపీలో గానీ, రాజధాని హైదరాబాద్ లో గానీ ఐటీ కంపెనీలన్న మాటే వినబడేది కాదు. ఎప్పుడైతే ఐటీదే భవిష్యత్తు అని చంద్రబాబు గ్రహించారో… మరుక్షణమే ఆ రంగంపై దృష్టి సారించారు. కొండలు, గుట్టలతో నిండిపోయిన హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మాదాపూర్, మణికొండల్లో ఐటీ పార్కులను అభివృద్ధి చేశారు. అందులో భాగమే మాదాపూర్ లోని సైబర్ టవర్స్. సైబర్ టవర్స్ తో పాటు ఆ పరిసరాల్లో లెక్కలేనన్ని ఐటీ కంపెనీలు తమ కార్యస్థానాలను ఏర్పాటు చేసుకునేలా చంద్రబాబు ప్రత్యేకంగా ఓ ఐటీ పాలసీనే తీసుకువచ్చారు. అప్పటిదాకా అమెరికా నుంచి బయటకు కాలుపెట్టని మైక్రోసాఫ్ట్ ను చంద్రబాబు హైదరాబాద్ కు తీసుకురాగలిగారు. మొత్తంగా సైబరాబాద్ సృష్టికర్తగా చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.