అమరావతిలో ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్ధులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి కలిగించడానికి ఒకేసారి 50 వేల మంది స్టూడెంట్స్‌తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్ధులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా క్వాంటం టెక్నాలజీలో నోబెల్ ప్రైజ్ సాధిస్తే.. వారికి వంద కోట్లు ఇస్తామని చెప్పారు.
పాతికేళ్ల క్రితం విజన్ 2020 కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణం చేసి.. గ్లోబ్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసిన అనుభవం చంద్రబాబు సొంతం. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఇప్పుడు ఏపీని క్వాంటం విప్లవానికి కేంద్రంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఐటీ నిపుణుల్లోని ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే. వీరిలోనూ తెలుగు వాళ్లే ఎక్కువ. ఇదే బాటలో.. క్వాంటం టెక్నాలజీలోనూ ఏపీ యువత ఆగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.
క్వాంటం స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ టెక్నాలజీలో నిపుణులైన మానవ వనరులను తయారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఒక్క ప్రకటనతో 54 వేల మంది విద్యార్ధులు.. క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకోవడం ఒక రికార్డు. ఇంత మంది స్టూడెంట్స్ భవిష్యత్ టెక్నాలజీపై ఆసక్తి చూపించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో క్వాంటం సాఫ్ట్‌వేర్‌తో పాటు.. కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిని కూడా అమరావతి నుంచి ప్రారంభించనున్నారు. అందరి కంటే ముందుగా భవిష్యత్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల.. ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది.











