ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు. స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయిఅపర్ణతో రాజా రమేష్ వివాహం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మాదాల రవి, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి, వై. విజయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ప్రభ ప్రముఖ కూచిపూడి నృత్యాకారిణి కూడా. ప్రముఖ నాట్య గురువు వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నీడలేని ఆడది చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి తదితర హీరోలందరి పక్కనా హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా మహానటుడు ఎన్టీఆర్ రూపొందించిన దానవీరశూర కర్ణ చిత్రంలోని చిత్రం భళారేమి చిత్రం పాటలో ప్రభ అభినయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు. వారి ఇంట జరుగుతున్న ఈ శుభకార్యానికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తూ తరలివచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.