బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఎంత? వస్తున్న వస్తున్న వసూళ్లు ఎంత? చివరికి మిగిలేది ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని నిర్మాణ ఖర్చు రూ. 400 కోట్లుగా చెబుతున్నారు. ఇందులో నటీనటుల పారితోషికమే ఎక్కువ. ఒక్క ప్రభాస్ కే 100 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇది కాకుండా సినిమాకి వచ్చిన లాభాల్లో 10 శాతం షేర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ కు 50 కోట్లు, ఇతర నటీనటులకు మరో 50 కోట్లు కలిపితే మొత్తం 200 కోట్లు పారితోషికం రూపంలోనే ఖర్చయింది. ఇక నిర్మాణ ఖర్చు రూ. 200 కోట్లు దాకా ఉంటుంది. దీని ధియేట్రికల్ బిజినెస్ రూ. 350 కోట్ల దాకా జరిగింది. ఆ లెక్కన చూస్తే ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఓటీటీ డిజిటల్ రైట్స్ రూపంలోనే రూ. 350 కోట్లు దక్కాయి. ఇది కళ్లు చెదిరే మొత్తమేననాలి. రూ. 350 కోట్లకి ఈ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మూడు రోజుల్లో థియేటర్లలో వసూలైన మొత్తం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో సలార్ 330 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే షేర్ గా రూ. 185.67 కోట్లు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా సుమారు 700-800 కోట్ల వసూళ్లను చేరుకునే అవకాశం ఉంది. ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లోనూ సలార్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడం సలార్ కు కష్టమేమీ కాదు.
ప్రభాస్ తర్వాతే బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్థానం అని చెప్పవచ్చు. వసూళ్లలో కింగ్ ఖాన్ ను మించిపోయేలా ప్రభాస్ దూసుకెళుతున్నాడు. కాకపోతే పఠాన్, జవాన్ లతో పాటు డంకీ కూడా ఇదే ఏడాది విడుదల కావడం షారుఖ్ కు ప్లస్ అయ్యింది. ఈ మూడు సినిమాల మీద షారుఖ్ ఎంత లేదన్నా 2000 కోట్ల పైచిలుకే వసూలు చేస్తాడు. ఆ మార్కును చేరుకోవడం ప్రభాస్ కు కాస్త కష్టం కావచ్చు. ప్రభాస్ ఆదిపురుష్ పరాజయం పాలై రూ. 353 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. అందువల్ల సింగల్ గా చూస్తే ప్రభాస్ దే పైచేయిగా కనిపిస్తుంది. ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ట్రిపుల్ ఆర్ ఉండగా, ఆ తర్వాత ‘బాహుబలి 2’ ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’కి రూ. 235 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే టికెట్ రేట్లు పెంచి విడుదల చేయడం వల్ల ఆ రికార్డు సొంతమైంది. రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 మాత్రం 215 కోట్లు వసూలు చేసింది. మూడో స్థానం సలార్ కి దక్కి 180 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక నాలుగో స్థానంలో కన్నడ స్టార్ యశ్ ‘కెజియఫ్ 2’ ఉంది. ఆ సినిమా మొదటి రోజు రూ. 170 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. విజయ్ లియో కూడా తక్కువ తినలేదు. తొలిరోజు 145 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత స్థానంలో ‘జవాన్’ 129 కోట్లు వసూలు చేసింది. రూ. 128 కోట్లతో ‘సాహో’, రూ. 116 కోట్లతో యానిమల్ ఉన్నాయి. రూ. 108 కోట్లతో ‘పఠాన్’, రూ. 105 కోట్లతో ‘ఆదిపురుష్’ ఉన్నాయి. భారీ అంచనాలతో విడుదలైన డంకీ మొదటిరోజు ఇండియా వైడ్ 60 కోట్ల గ్రాస్ ని మాత్రం రాబట్టింది. ముంబైల్ కొన్ని థియేటర్లలో ఇప్పుడు డంకీ తీసేసి సలార్ వేస్తున్నారు. ఇక మూడు రోజుల కలెక్షన్ల పరంగా చూస్తే బాహుబలి 2 రూ. 540 కోట్లు వసూలు చేయగా, ట్రిపుల్ ఆర్ రూ. 500 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ జవాన్ కూడా తక్కువ సాధించలేదు. 385 కోట్లు జవాన్ వసూలు చేసింది. ఆ తర్వాతే సలార్ ఉంది.
ప్రభాస్ ప్రభంజనం ఎక్కడి దాకా వెళుతుందో తెలియాలి అంటే ఈ ఏడాది ముగియాలి.