ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇంకెక్కడో లైట్ వెలుగుతుంది.. మరెవరికో షాక్ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామెంట్స్‌కి ఇలాంటి రియాక్షనే వచ్చింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన మీద ఆరోపణల కంటే.. ఏపీ మీద.. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే కేసీఆర్ తెలంగాణ ఇష్యూస్ కంటే.. ఏపీ మీద ద్వేషాన్నే నమ్ముకొన్నారని అర్ధం చేసుకోవాలి. కానీ ఈ స్ట్రాటజీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. మళ్లీ అదే వ్యూహం అనుసరిస్తే బీఆర్ఎస్‌కి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే..
తెలంగాణలో టీడీపీని వ్యతిరేకించే వాళ్లు.. సమర్ధించే వాళ్లు.. అందరూ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ క్యాడర్ టీడీపీకి బద్ద వ్యతిరేకం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో.. రాష్ట్ర విభజన తర్వాత కూడా వీళ్లు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇప్పటికీ హస్తం చేతిని వదల్లేదు. కేసీఆర్ చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా.. ఏపీ మీద ఎన్ని శాపనార్ధాలు పెట్టినా.. టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస క్యాడర్.. హస్తానికి చెయ్యిచ్చి.. కారెక్కే ఛాన్స్ లేదు. ఇక బాబుని టార్గెట్ చేశాక.. టీడీపీ సానుభూతిపరులు ఎలాగూ సపోర్ట్ చేయరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమయింది. అయితే కేసీఆర్.. చంద్రబాబుని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ శ్రేణులకు సంతోషం కలిగించింది.
ఇక్కడ వైసీపీ కేడర్, ఆ పార్టీ లీడర్లు పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. జనసైనికులు ఈ విషయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఇలాంటి సమయంలో ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట శాపమని కామెంట్ చేశారు కేసీఆర్. అంతేగాక జగన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అనే సిగ్నల్ ఇచ్చారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో జగన్ పార్టీనీ టార్గెట్ చేసుకొంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి మానసిక ఆనందం కలిగించినా.. రాజకీయంగా భారీ నష్టం కలిగించాయి. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా లాభం కలిగిందా.. అంటే.. జూబ్లీ హిల్స్ రిజల్ట్స్‌ని గుర్తు చేసుకోవాలని చెప్పక తప్పదు.











