మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే. అన్ని సహజ మరణాలుగానే కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్యషబానాపై శనివారం రాత్రి కొందరు మహిళలు దాడి చేశారు.
ఈ నేపథ్యంలోనే షబానా సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న కారణంతో తన భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని షబానా ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం మల్లేలకు చెందిన షంషూన్, పర్వీన్ తన ఇంట్లోకి వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని వాపోయారు. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, మల్లేలకు చెందిన వైకాపా నాయకుడు రవి ఏడాదిలోగా దస్తగిరిని నరికి చంపుతారంటూ వారు తనను బెదిరించారని షబానా ఆరోపించారు. జగన్, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్న నేపథ్యంలో తన భర్తను చంపేస్తారన్న భయం కలుగుతోందన్నారు. తనపై దాడి చేసిన మహిళలు పదే పదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారని చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి దర్యాప్తు చేయాలని కోరారు.
వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఆరుగురు ఇప్పటివరకూ మరణించారు. వైసీపీ హయాంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల వివేకా హత్య జరిగిన రోజు వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న చనిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కటిక రెడ్డి శ్రీనివాసుల రెడ్డి, కల్లూరి గంగాధర్ రెడ్డి, మాజీ సీఎం జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆరుగురివి సహజ మరణాలేనని బయటకు కనిపిస్తున్నప్పటికీ..లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి.