గడిచిన ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచాలన్న లక్ష్యంగానే ముందుకెళ్లింది. ఏదో ఓ సాకుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపింది. ఐతే ఎన్నికల సమయంలో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం..ఛార్జీలను ఎలా తగ్గించాలన్న ఆలోచన చేసింది. దీంతో వినియోగదారలకు విద్యుత్ సంస్థలు ఊరట కల్పించాయి. నాలుగో నియంత్రిత వ్యవధి 2019-24 మధ్య కాలానికి సంబంధించి రూ.1,059.75 కోట్ల ట్రూడౌన్‌ను అంటే ఛార్జీల తగ్గింపును ఏపీ ట్రాన్స్ కో ప్రకటించింది. గడిచిన ఐదేళ్లలో ఈ మాట ప్రజలు వినలేదు. ఫస్ట్ టైం ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినిపించింది. గత ప్రభుత్వం ట్రూ అప్ FPPCA (ఇంధన సర్దుబాటు ఛార్జీల) పేర్లనే పరిచయం చేసింది.
విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని EPDCL రూ.383.84 కోట్లు, SPDCL రూ.428.56 కోట్లు, CPDCL రూ.247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ట్రూడౌన్ వచ్చింది ఇలా –
నాలుగో నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు APERC అనుమతించిన ఖర్చు..వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. గత ఐదేళ్లలో కొవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి రెండేళ్ల పాటు లాక్‌డౌన్, కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి. ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కంలకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్‌కో పిటిషన్ దాఖలుచేసింది.
డిస్కంల లెక్కలపై కసరత్తు
ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. EPDCL రూ.240 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. CPDCL నుంచి కూడా రూ.400 కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉందని అంచనా. SPDCL లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారు.
ట్రూఅప్ అంటే APERC అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు అదనంగా చేస్తే..దాన్ని లెక్కించి ట్రూఅప్ కింద విద్యుత్ సంస్థలు వసూలు చేస్తాయి. ఇక ట్రూడౌన్ అంటే కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే..ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తాయి. ఆ మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదోలా తగ్గుతుంది.