బళ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత మనకు ఉండనే ఉంది. ఏ సినిమా వచ్చి ఏ సినిమాకు దెబ్బేస్తుందో ఎవరూ ఊహించలేరు. గాడ్ ఫాదర్ హిట్ అయిందని చంకలు గుద్దుకోవాలో, హిట్ అయినా డబ్బు రాలేదని బాధ పడాలో తెలియని పరిస్థితి నిర్మాతల్లో ఉంది. పైగా బావ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మీదకు బావమరిది అరవింద్ కాంతారాని వదిలాడు. పది రోజుల వ్యవధిలో గాడ్ ఫాదర్ మీదికి కాంతారా వచ్చిపడటంతో గాడ్ ఫాదర్ కు సరైన వసూళ్లు రాలేదన్న వాదన ఉంది. బావ మీద కోపంతో అరవింద్ ఇది కావాలని చేసింది కాదు.. కాకతాళీయంగానే జరిగింది. కానీ బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బదులు బాధను చూడాల్సి వస్తుందని అరవింద్ మాత్రం ఊహించలేరు కదా.
మరి ఇంతకీ గాడ్ ఫాదర్ ఎంత వసూలు చేసింది? ఇది ఏ రేంజ్ హిట్ అనే విషయాలను చూద్దాం. గాడ్ ఫాదర్ సినిమా అక్టోబరు 5న విడుదలైన సంగతి తెలిసిందే. పది రోజుల తేడాతో అక్టోబరు 15న కాంతారా విడుదలైంది. అయితే కాంతారా సినిమా కన్నడంలో సెప్టెంబరు 30నే విడుదలైంది. మంచి విజయం సాధించడంతో అరవింద్ రైట్స్ తీసుకుని హడావుడిగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. హిందీ వెర్షన్ అక్టోబరు 14న విడుదలైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను కూడా ఇక్కడ మరువ కూడదు. అల్లు అరవింద్ చేసింది అదే. ఒకవేళ కాంతారా కనుక ఆ సమయంలో విడుదల కాకుండా ఉండి ఉంటే గాడ్ ఫాదర్ మరికొంత వసూళ్లు సాధించేదనడంలో అతిశయోక్తి కాదు.
మొత్తంగా గాడ్ ఫాదర్ గ్రాస్ వసూళ్లు రూ. 100 కోట్లు దాటలేదు. అంటే షేర్ 70 కోట్లు కూడా దాటలేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన తార ఉండి కూడా కనీసం 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించలేకపోవడం మాత్రం శోచనీయం. నటుల రెమ్యూనరేషన్ తో కలిపి ఈ సినిమా నిర్మాణానికే రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాతలు అంటున్నారు. మరి 16 కోట్ల వ్యయంతో నిర్మించిన కాంతారా మాత్రం రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మరి తప్పు ఎక్కడ జరిగిందో చూద్దాం. అసలు రీమేక్ సినిమా ఎంచుకోవడమే ప్రధాన తప్పు. మోహన్ లాల్ హీరోగా రూపొందిన లూసీఫర్ ను తెలుగులో అనువదించి కూడా విడుదల చేశారు.
పైగా ఓటీటీలోనూ ఈ సినిమా ఉంది. మెగాస్టార్ చేస్తున్నారంటే ఇందులో ఏదో ఉందని కూడా జనం మలయాళ డబ్బింగ్ సినిమాను చూసేశారు. ఇక రెండో తప్పు విడుదల విషయం. కాంతారా సినిమా విడుదలను తన పలుకు బడితో చిరంజీవి ఇంకో వారం వాయిదా వేయించి ఉంటే బాగుండేది. మొత్తం మీద కాంతారా మాత్రం గాడ్ ఫాదర్ ను కూడా గడగడలాడించిందనే చెప్పాలి. కాంతారా తెలుగు రైట్స్ ను రెండు కోట్లు పెట్టి దక్కించుకున్న అరవింద్ కు ఇప్పటికి దాదాపు 20కోట్లు మిగిలి ఉంటుందని అంచనా. మొత్తానికి ప్రభంజనం సృష్టించిన కాంతారా ఇటు మెగాస్టార్ సినిమాకు ఎంతో కొంత దెబ్బేసిందని చెప్పక తప్పదు.