కాంతార సినిమాలో వరాహరూపం పాట ఇక వినపడదా? కోర్టు తీర్పు ప్రకారం అదే జరగాలి మరి. ‘కాంతార’ సినిమాలో ఈ పాట పెద్ద హిట్. దీన్ని థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పుఇచ్చారు. చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. ఈ ఫ్లాట్‌ఫామ్స్ ఏవీ తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్లే చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
కాయలున్న చెట్టుపైనే రాళ్లు పడుతుంటాయి అనడానికి ఇదో ఉదాహరణ. సినిమాలో మంచి కంటెంట్ ఉండి కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార మూవీ ఇప్పుడు విమర్శల్లో చిక్కుకుంది. ముఖ్యంగా అందులో క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం పాటపై వివాదం తలెత్తింది. ఈ పాట ట్యూన్ ను మలయాళం నుంచి కాపీ కొట్టారనేది ప్రధాన అభియోగం. దీనికి కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ గొంతు విప్పడం లేదు. వివరాల్లోకి వెళ్లి చూద్దాం. ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ ను పోలి ఉంది. అక్కడి నుంచి కాపీ కొట్టారంటూ వివాదం మొదలైంది. ఈ తమ నుంచి కాపీ కొట్టారని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జి ఆరోపించింది. వరాహ రూపం పాటను ఐదారేళ్ల క్రితమే నవరసం పేరుతో ఈ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసింది.
దీనికి యూట్యూబ్‌లో 42 లక్షల వ్యూస్ కూడా ఉన్నాయి. తమ పాటను కాపీ కొట్టారని, ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా వాడుకున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మ్యూజిక్ బ్యాండ్ పేర్కొంది. ఈ నవరస పాట, వరాహ రూపం రెండింటిని చూస్తే పెద్దగా తేడా కూడా మనకు అనిపించదు. నవరస పాటలోని ఆర్కెస్ట్రాను కాంతారాలోని వరాహారూపం పాటకు యథాతథంగా తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆ సంస్థ అంటోంది. అయితే ఈ పాట వివాదంపై సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ మీడియాకు దీనిపై ఎలాంటి వివరణా ఇవ్వవద్దని హోంబాలే ఫిల్మ్స్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదును తమ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన తైక్కుడం బ్రిడ్జి దీనికి కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్ చేసింది. అయితే ఈ వివాదం విషయంలో ఆరోపణలు చేసిన వారికి హోంబాలే ఫిల్మ్స్ సమాధానం చెబుతుందని అంటున్నారు. అయితే అజనీష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు అజనీష్ ఈ వివాదంపై స్పందిస్తూ ట్యూన్ కాపీ కొట్టలేదని, దాని వల్లే తాను స్ఫూర్తి పొందానన్నారు.
తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండిస్తున్నారు. రెండు పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల ఒకేలాగా అనిపిస్తోందనేది ఆయన వాదన. మంచి టాక్‌తో దూసుకెళ్తున్న కాంతార టీమ్‌కి పాట విషయంలో కొత్త తలనొప్పి మొదలైంది మరి. ఇది ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. హీరో రిషబ్ శెట్టి కూడా ఈ వివాదంపై ఇంతవరకు స్పందించలేదు. సినిమా పరిశ్రమలో కాపీ కొత్త కానేకాదు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపితే మంచిది. తాజాగా ఈ కేసులో కోర్టు ‘కాంతార’ మేకర్స్‌కు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుపై తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ వివాదం సంగతి పక్కనపెడితే.. ‘కాంతార’ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. కానీ రేపటి నుంచి ఈ పాట థియేటర్లలో ఉండకపోవచ్చు. యూట్యూబ్ తో సహా ఓటీటీలో కూడా ఈ పాటను ప్రదర్శించకూడదు.











