వినోదానికి పెద్ద పీట వేసే ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ ఓ కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమానే ఆర్గానిక్ మామ – హైబ్రిడ్ అల్లుడు. టైటిల్ చూస్తేనే చాలా కొత్తగా ఉంది. తన ఫార్ములాకు దూరంగా వెళ్లకుండా ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ను నిన్న విడుదల చేశారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని జంటగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం.
టీజర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘ఎస్.వి. కృష్ణారెడ్డి అనే టైటిల్ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి’ అని శేఖర్ కమ్ముల అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పటిదాకా 40 చిత్రాల వరకూ రూపొందించారు. ఈ కథను కరోనా సమయంలో తయారుచేసుకున్నారట.
ఈ కథ గురించి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ఈ కథ రాసిన సమయంలో అచ్చిరెడ్డి ఫోన్ చేసి ఆ సమయంలో అచ్చిరెడ్డి ఫోన్ చేసి రేయ్ నువ్వు ఖాళీగా ఉంటే అద్భుతంగా వచ్చిన ఈ కథను మళ్లీ మెరుగులు దిద్దుతూ పాడుచేస్తావేమో అనిపిస్తోంది. ఓపని చెయ్.. ఈ కథను అలాగే లాక్ చేసేసి దీనికి మాటలు రాయి అన్నాడు. దానికి నేను మాటలు రాయడం ఏంట్రా. అని నా పని కాదు కదా అన్నాను. దానికి వాడు డైరెక్షన్ నీ పనా? కథ రాయడం నీపనా?, స్క్రీన్‌ప్లే నీ పనా?, సంగీతం నీ పనా? అవన్నీ చేయలేదా.. ఏంటి?. ఈ మాటలు కూడా రాయగలవు. నేను చెపుతున్నా రాయి అన్నాడు. అచ్చిరెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అయ్యా.. ఇప్పుడు ఈ సినిమాకు మాటలు కూడా రాశాను. మేం పేపర్ ఎడిటింగ్ చేసుకుంటాం.
ఏదైనా సీన్ గానీ, డైలాగ్ గానీ చెబితే.. అది ఎన్ని నిముషాలు, ఎన్ని సెకన్లు వస్తుందో కూడా అచ్చిరెడ్డి పర్‌ఫెక్ట్‌గా చెప్పేయగలడు. అలా రెడీ అయిన ఈ స్క్రిప్ట్‌ను కల్పన గారికి వినిపించగానే ఆమె షాక్ అయ్యారు. ఇంత మంచి స్క్రిప్ట్ మనం స్క్రీన్ మీద పెట్టక పోతే ఎలా.. మనం ఈ సినిమా చేసేస్తున్నాం అంతే అని ఆ క్షణంలోనే ఫిక్స్ అయిపోయారు. ఆరోజు నుంచి 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆమె ఎలా ప్లాన్ చేశారో నాకు అయితే తెలియదు’ అని వివరించారు. ఇందులో ఇంకా సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు నటించారు. ఆఖండ సినిమాకి పనిచేసిన రామ్ ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేశారు.











