అవినీతికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కేసిఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలతో సీఎస్ కూడా వీఆర్ఓల వద్ద ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని డిపార్ట్మెంట్ హెడ్స్ కు ఆదేశాలు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోగా ఈ రికార్డులను స్వాధీనం చేసుకొని నివేదికలు పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
ఏసీబీ అధికారులు జరిపిన సోదాలలో ఎక్కువ శాతం మంది వీఆర్ఓలు దొరుకుతున్నారు. దీంతో సీఎం కేసిఆర్ ముందుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత శాసనసభ సమావేశాలలో కొత్త చట్టాన్ని రూపకల్పన చేస్తున్నట్లు తెలిపిన కేసిఆర్ ఆ చట్టాన్ని తాజాగా జరుగుతున్న సమావేశాలలో ప్రకటించనున్నారని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భూమి ఉన్న రైతుల పేర్లు రెకార్డులలోకి ఎక్కడం లేదని వీఆర్ఓ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఓలు సరిగా పనిచేయకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని మండిపడ్డారు. దీంతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఎన్టీఆర్ బాటలోనే కేసిఆర్ నడుస్తున్నాడు’ అనే చర్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కూడా పటేల్, పట్వారి వ్యవస్థలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆదర్శంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసిఆర్ ఆయన విధానాలనే అమలు చేస్తున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసినా వీఆర్ఓలను వేరే డిపార్టుమెంటులలో సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. కేసిఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రెవెన్యూ పై అసెంబ్లీ లో చట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. విఆర్వో ల వ్యవస్థ రద్దు చేస్తామనడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సభలో లో మాట్లాడుతాం…బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారనే ఆశిస్తున్నామని ఆయన అన్నారు.