Pawan Kalyan Landed In Vijayawada :
ఏపీలో జగన్ ప్రభుత్వంపై నిరసనలు హోరు ఓ రేంజిలో మొదలుకానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు టీడీపీ, నిరుద్యోగులు, వామపక్షాలు తమదైన శైలిలో ఇప్పటికే నిరసన ప్రదర్శనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఇకపై జనసేన నిరసనలు హోరెత్తనున్నాయి. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే జగన్ పై తన నిరసనల హోరును మొదలెట్టనున్నట్లుగా చెప్పేశారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్… అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
ఇక వరుసగా నిరసనలే
ఈ సందర్భంగా పవన్ డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుందనే చెప్పాలి. సినిమాల విషయంలో ఎలా ఉన్నా… రాజకీయ కార్యక్రమాల కోసం వచ్చే సమయంలో పవన్ దాదాపుగా తెలుగు రంగు దుస్తుల్లోనే వస్తున్న సంగతి తెలిసిందే. లేదంటే.. లేత, ముదురు నీలం రంగు చొక్కాలనే ధరిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా బుధవారం నలుపు రంగు జుబ్బాతో పవన్ బెజవాడ చేరుకున్నారు. నలుపు రంగు చొక్కా వేసుకుంటే.. నిరసన తెలపడమనే కదా అర్థం. తన భావన కూడా నిరసన బాటేనన్న మాట చెప్పేందుకే పవన్ నలుపు రంగు జుబ్బాతో ప్రత్యక్షమయ్యారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నాడు చంద్రబాబు కూడా..
ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నలుపు రంగు చొక్కా వేసుకున్న వైనం తెలిసిందే కదా. నలుపు రంగు చొక్కా వేసిన చంద్రబాబు.. జేబుకు నలుపు రిబ్బన్ ధరించి మోదీ సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కూడా నలుపు రంగు చొక్కాతో దర్శనమివ్వగానే.. ఠక్కున నాడు నలుగు షర్ట్ లో కనిపించిన చంద్రబాబే గుర్తుకు వచ్చారని చెప్పాలి. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇకపై వరుసగా నిరసనలు చేపట్టాలన్న భావనతో ఏపీలో అడుగుపెట్టిన పవన్.. జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.