ఓటర్లు చైతన్య వంతులు. తిమ్మిని బమ్మి చేసే రాజకీయ నాయకుల కంటే ఓటు వేసే వాళ్లు ఓ
అడుగు ముందే ఆలోచిస్తారు. ఎన్నికల వేడి రాజకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిదే జరుగుతోంది.
ఓటు వేసే ప్రతి ఒక్కరిలోనూ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ఏపీలో అధికారం మార్చే దిశగా సాగుతుందనడంలో సందేహం లేనంతగా ఉందని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్ర
అతి ముఖ్యమైన ప్రాంతం. రాజకీయ చైతన్యం అక్కడి ఓటర్లలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జయభేరి మోగించటం మార్పునకు నాంది పలికింది. ఈ విజయం ద్వారా తెలుగుదేశంను తమ నుంచి వేరు చేయలేరని ఉత్తరాంధ్ర ఓటర్లు నిరూపించారు. అక్కరకు రాని పథకాలు, ఉచితాలతో అక్కడి ప్రజలకు జగన్ ప్రభుత్వం అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఈ తరుణంలో తమ దగ్గరకు వస్తున్న మంత్రులు, నేతలను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏమీ తెలియదనుకుని జనంలోకి వస్తే ఇలానే ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర నేత మంత్రి ధర్మానకు ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ మధ్య ఆయన ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఎవరికి ఓటేస్తారని అక్కడున్న వారిని ప్రశ్నిస్తే.. సైకిల్ గుర్తుకు అని సమాధానం వచ్చింది. దీంతో షాక్ తిన్న ధర్మాన అక్కడి వాళ్లందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేయటం పెద్ద సంచలనమే అయింది. తెలుగుదేశం పార్టీతో తమ అనుబంధాన్ని మరచిపోలేదని ఓటర్లు గుర్తు చేశారు. అదే ధర్మాన రెండు రోజులు క్రితం ఓ మత్సకారుల సమావేశంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తును, తెలుగుదేశం పార్టీని ఓటర్ల మది నుంచి తీసే ప్రయత్నం చేశారు. ఎందుకు టీడీపీ అంటే అంత మోజుమీకు అంటూ జనాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ధర్మాన వివరించే ప్రయత్నం చేసినా అక్కడి వాళ్లెవరూ పట్టించుకోలేదు.
అడుగడుగనా భయంతో జనంలోకి వెళుతున్న ఉత్తరాంధ్ర నేతలకు మునుముందు ఎదురవ్వబోయే పరిస్థితేమిటో అర్థమవుతోంది. కేవలం జగన్ కుట్ర కారణంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లారన్న పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉంది. దీంతో పాటు లోకేశ్ పాదయాత్ర, జనసేన వారాహి యాత్రతో ఈ చైతన్యం మరింత పెరిగితే వైసీపీ ఉత్తరాంధ్రలో తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. ఉత్తరాంధ్ర ప్రజల నాడిని పసిగట్టిన తెలుగుదేశం నేతలు అందుకు తగ్గట్టే వైసీపీని ఓడించేలా పార్టీని బలపరిచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.