అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్, బైడెన్ కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. 306-232 ఓట్ల తేడాతో గెలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్‌ను ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లు ఇవాళ లాంఛనంగా ఎన్నుకున్నారు. ఇందుకు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు సంయుక్తంగా సమావేశం అయ్యాయి. బైడెన్ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్ చివరి ప్రయత్నం హింసాత్మకంగా మారింది. ట్రంప్ పిలుపు మేరకు దేశం నలుమూలల నుంచి 5 లక్షల మంది మద్దతుదారులు తరలివచ్చారు. ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులకు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం హింసాత్మకంగా మారింది.
ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన ట్రంప్
అన్ని దారులూ మూసుకుపోవడంతో ట్రంప్ చివరి ప్రయత్నంగా మద్దతు దారులను రెచ్చగొట్టారని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ట్రంప్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఇవన్నీ విఫలం కావడంతో చివరి అస్త్రంగా మద్దతుదారులను రెచ్చగొట్టారు. లక్షలాది మంది క్యాపిటల్ భవనంలోకి దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళతో కలిపి నలుగురు చనిపోయారని తెలుస్తోంది. అమెరికా కాంగ్రెస్ కూడా జో బైడెన్ గెలుపును ధృవీకరించింది. దీంతో ట్రంప్ ఓటమిని అంగీకరించక తప్పలేదు.
లైన్ క్లియర్
ట్రంప్ ఓటమిని అంగీకరించడంతో జో బైడెన్ కు లైన్ క్లియర్ అయింది. అమెరికా కాంగ్రెస్ కూడా జో బైడెన్ గెలిచినట్టు ప్రకటించింది. అధ్యక్షపీఠం అందుకునేందుకు అవసరమైన 270 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ ను బైడెన్ సాధించారని కాంగ్రెస్ ప్రకటించింది. ఎలక్టోలర్ కాలేజీ సభ్యుల్లో 306 మంది బైడెన్ కు మద్దతు పలికారు. 232 మాత్రమే ట్రంప్ పక్షాన నిలిచారు. దీంతో జో బైడెన్ గెలిచినట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 20న 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. దీంతో అమెరికాలో 6 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది.
ట్రంప్ చివరి నిర్ణయంతో వాషింగ్టన్ లో కర్ఫ్యూ
అధ్యక్ష ఎన్నికల్లో అన్యాయం జరిగిందని, అడ్డుకోవాలని ట్రంప్ మద్దతుదారులకు పిలుపు నివ్వడం, వారంతా వాషింగ్టన్ చేరుకుని క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి దిగడం చూస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలోనే ఇలా జరుగుతోందా.. అనే అనుమానం వస్తోంది. కాంగ్రెస్ లో జో బైడెన్ మెజారిటీ రావడంతో, ఆందోళనకారులను ట్రంప్ శాంతింపజేసేలా ప్రకటన చేయాలని బైడెన్ కోరారు. విపరీతమైన మంచు, తెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా లక్షలాది ట్రంప్ మద్దతుదారులు ఇంకా వాషింగ్టన్లోనే తిష్ఠ వేశారని తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన కోసం వారంతా వేచి చూస్తున్నారు. ట్రంప్ శాంతి వచనాలు పలికితే వారు ఇంటిదారి పట్టే అవకాశం ఉంది.