గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కార్ అందినకాడల్లా దోచుకుంది. కాదేది అవినీతికి అనర్హం అన్న చందంగా వ్యవహరించింది. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఐదేళ్లు నకిలీ, కల్తీ మద్యం ఏరులై పారింది. ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ హయాంలో పార్టీలో నెంబర్ – 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులు జే టాక్స్..బిగ్‌బాస్‌కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం నడపడం కోసం వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పని చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్‌వర్క్ రూపొందించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం.
నెలకు రూ.60 కోట్ల చొప్పున మొత్తం నాలుగేళ్ల రెండు నెలల్లో 3 వేల కోట్ల రూపాయలకుపైగా కుంభకోణం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. వసూళ్ల నెట్‌వర్క్ రూపకల్పన, ప్లాన్ పక్కాగా అమలయ్యేలా చూడడం వెనుక పెద్దిరెడ్డి తనయుడే కీలకంగా వ్యవహరించారని, ఈ స్కామ్‌లో బిగ్‌బాస్ తర్వాత కీలక వ్యక్తి ఆయనేనని అధికారులు తేల్చారు. సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి బేసిక్ ప్రైజ్ అడ్డగోలుగా పెంచేసి, అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా..ఆయన కుమారుడు ఎంపీగా ఉన్నారు. తండ్రి మైనింగ్‌లో అడ్డగోలుగా దోచేస్తే..కొడుకు తానే తక్కువ తినలేదంటూ లిక్కర్ స్కాంలో అంతా తానై నడిపించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీపైనా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అటవీ భూములు కబ్జా చేశారన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించింది.
235 కంపెనీల్లో..7 సంస్థలకే రూ.9,221 కోట్లు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉండగా..కేవలం 7 సంస్థలకే దాదాపు రూ9 వేల 221 కోట్లు అంటే 60 శాతం మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా అప్పటి ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలేనని దర్యాప్తులో తేలింది.
అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నేత విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సొంతంగా ఒక్క డిస్టలరీ లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్. SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను ఈ సంస్థ సరఫరా చేసినట్లు సీఐడీ గుర్తించింది.
అవినీతి ఏరులై పారింది ఇలా-
మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపుల వసూళ్లకు 7 అంచెల విధానాన్ని పక్కాగా ప్లాన్ చేశారు. మొదటగా ముడుపుల చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ, డిస్టిలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నాయి. రెండో అంచెలో ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకున్నారు.ముడుపుల సొత్తు వారికి ఇచ్చేవారు. ఇక మూడో అంచెలో క్యాష్ హ్యాండ్లర్లు..రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు ఆ మొత్తాన్ని అప్పగించేవారు. నిత్యం ఒకేచోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో అందజేసేవారు. ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్లు మార్చేసేవారు. నాలుగో అంచెలో క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటకు చేర్చేందుకు ఓ కీలక వ్యక్తిని ఆర్గనైజర్‌గా పెట్టుకున్నారు. ఇక ఐదో అంచెలో ఆర్గనైజర్ తనకు అందిన సొమ్ము మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కసిరెడ్డి నుంచి ఆ సొమ్ము పెద్దిరెడ్డి కుమారుడికి వెళ్లేది. తర్వాత ఆ మొత్తాన్ని ఆయన బ్లాక్ మనీగా వివిధ రూపాల్లోకి మార్చి బిగ్‌బాస్‌కు చేర్చేవారు.
పెద్దిరెడ్డి కుమారుడు ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించడంతో పాటు డిస్టిలరీల్లో పాగా వేసి పలు బ్రాండ్ల మద్యం తయారు చేయించి వాటికే అత్యధికంగా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోనే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేయించారని, వాటికే దాదాపు రూ. 2 వేల 701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.