గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతితో పాటు అడ్డగోలు అప్పులతో ఏపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వనరులు, ఆదాయ వృద్ధిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.
జగన్ అనుసరించిన విధానాల వలన ఏపీలో జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు సీఎం చంద్రబాబు. ఐనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై భారం మోపలేమన్నారు. ఆదాయార్జన శాఖల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం తప్ప మరో మార్గం లేదని అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని చెప్పారు. అదే సమయంలో వ్యాపారులను వేధింపులకు గురిచేయొద్దన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు, పురోగతిపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420 కోట్లు రాగా..ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.41,382 కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ శాఖలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఎక్సైజ్ పాలసీ కొత్త విధానం వల్ల ఆ శాఖలోనూ ఆదాయం పెరుగుతుందన్నారు. గనుల శాఖలో ఇప్పటివరకూ అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదన్నారు అధికారులు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి, వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే రాబడి స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.1,02,154 కోట్లు ఉండొచ్చని చెప్పారు. కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కృషి, గనుల తవ్వకానికి అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా ఆ శాఖలో రాబడి పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆదాయార్జనపై ఇకపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తానన్నారు.
వైసీపీ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే ఆదాయార్జన శాఖలు మంచి పని తీరు కనబర్చాలన్నారు సీఎం చంద్రబాబు. సాధారణ పనితీరు, లక్ష్యాలతో పనిచేస్తే ఫలితాలు రావని..ఆదాయం పెంచేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమన్నారు.కేంద్ర నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాను డిల్లీలో కలిసి గంట 45 నిమిషాల పాటు గంటలపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించానని తెలిపారు. తన తపనంతా రాష్ట్రం కోసమేనని, అధికారులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని పనిచేయాలని కోరారు.