ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ బిజిబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమైన లోకేష్..బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రాబోయే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, అందుకు కేంద్రంగా చేయూతనివ్వాలని విన్నవించారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు నారా లోకేష్.
కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్‌ను మంగళగిరి శాలువాతో సత్కరించి..రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అత్యధిక కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త పాలసీల గురించి కేంద్రమంత్రికి వివరించారు. AI విప్లవంతో డేటా సిటీలకు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతుందని, ఏఐ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్థతిలో కేంద్రం నుంచి అనుమతులు మరింత సులభతరం చేయాలని అశ్విని వైష్ణవ్‌ను కోరారు. 2047కి 30 ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ చేరాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని…కేంద్ర సహకారంతో ఏఐ రంగంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని వికసిత్ భారత్ లక్ష్యంలో ఏపీ భాగస్వామి అవుతుందన్నారు లోకేష్.
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు లోకేష్. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు లోకేష్. ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు వేగంగా అనుమతులు ఇవ్వడమే కాకుండా, ప్రాజెక్టులు స్పీడ్‌గా ఏర్పాటయ్యే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక సొంత నియోజకవర్గం మంగళగిరిలో 800 నిరుపేద కుటుంబాలు రైల్వే భూముల్లో నివసిస్తున్నారని, ఆ భూమును మానవథా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు లోకేశ్. అదే జరిగితే నిరుపేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. కలిసికట్టుగా ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని లోకేశ్ అన్నారు.
ఢిల్లీ వెళ్లిన లోకేష్‌ను కలిసేందుకు కూటమి ఎంపీలు ఆసక్తికనబరించారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మతో పాటు బీజేపీ, తెలుగుదేశం ఎంపీలు లోకేష్‌తో సమావేశమయ్యారు. ఏడు నెలల్లోనే విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్‌ప్లాంట్‌కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కావడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక నిధులు సాధించడంలో లోకేష్ పాత్ర ఎంతో ఉందంటూ ఇటీవల ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.