అన్నా చెల్లెళ్లు దాదాపు మూడేళ్ల తర్వాత కలిశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల చాలా కాలం తర్వాత ఒకరినొకరు కలవడం.. రాష్ట్రంలో చాలా ఆసక్తిని కలిగించింది. కానీ, అది ఆప్యాయత, ఆపేక్షలతో కూడిన కలయిక కాదు. ఏదో పేగు తెంచుకొని పుట్టిన బంధం వల్ల మాత్రమే ఫార్మాలిటీకి ఆ తోబుట్టువులు కలిశారు. జగన్ మేనల్లుడి వివాహం.. అందుకే ఎన్ని విభేదాలు ఉన్నా పక్కన బెట్టి మరీ వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లికి.. తన అన్నను ఆహ్వానించడానికి తాడేపల్లిలోని జగన్ ఇంటికి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్వాన పత్రిక అందించి.. తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. కేవలం పావుగంటకు మించి అక్కడ లేరు. బయటికి వచ్చాక కూడా పొడి మాటలు మాట్లాడారు.
రాజా రెడ్డి పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చానని చాలా తేలిగ్గా చెప్పారు. ఆమె మాటల్లో తన అన్నను చాలా రోజుల తర్వాత కలిశాననే భావం ఏ మాత్రం లేదు. అయితే, షర్మిల జగన్ ను కలిసిన ఈ పావుగంట సమయంలోనే ఆయన అడగాల్సిన విషయాలన్నీ మరొకరితో అడిగించేసినట్లు సమాచారం. చెల్లెలి కోసం బాగా కిందికి దిగాల్సిన పరిస్థితి ఇప్పుడు వైఎస్ జగన్‌కు ఉంది. ఆయినా ఆమె ఎదురుగా ఉన్నప్పటికీ అదే బెట్టు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పైగా రాజకీయాల్లో తనకు నష్టం కలిగించకుండా ఉండడం కోసం.. కొన్ని విషయాలను తన భార్య భారతి రెడ్డితో జగన్ షర్మిలను అడిగించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఉన్న ప్రచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను దెబ్బ కొట్టడానికి అటు షర్మిల, వివేకా కుమార్తె సునీత విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత లాభం కోసం చెల్లెళ్లని కూడా చూడకుండా అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అపవాదు జగన్ పై ఉంది. వివేకా హత్య విషయంలో షర్మిల, సునీత పరోక్షంగా గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి.. జగన్ పై ఎంత కోపంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని సునీత ఐదేళ్లుగా పోరాడుతుంటే.. జగన్ పదే పదే ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కేవలం రాజకీయ లాభం కోసం కుటుంబాన్ని, అందులోనూ చెల్లెళ్లైన ఆడపడుచులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎవరికీ నచ్చడం లేదు.
అందుకే ఈసారి ఎన్నికల్లో జగన్ కు పోటీగా సునీతను బరిలో నిలపాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కడప ఎంపీగా లేదా పులివెందుల నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతను బరిలో నిలుపుతారని తెలుస్తోంది. అందుకని, దీనిపై ఎప్పటినుంచో భయపడుతున్న జగన్.. షర్మిల కలిసిన సందర్భంగా.. సునీతను అక్కడ పోటీ నుంచి తప్పించాలని భారతి రెడ్డితో అడిగించారట. దీంతో వైఎస్ షర్మిల తన వదినపై సీరియస్ అయినట్లు సమాచారం. తనను అన్యాయంగా జగన్ తరిమేస్తే.. ఇలాంటి పనులేంటని అప్పుడు ఎందుకు మాట్లాడలేదని షర్మిల నిలదీసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీన్నిబట్టి వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంతో పాటు.. తన అన్న జగన్ గురించి ఇక పట్టించుకోవడం మానేసినట్లుగా అర్థం అవుతోంది.











